సత్యవేడు ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన హైకోర్టు

Advertisement
Update:2024-09-25 12:36 IST

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉన్నతన్యాయస్థానం కొట్టివేసింది. తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారంటూ తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి తూర్పు స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన తరఫున న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. హనీ ట్రాప్‌గా దీనిని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్‌ నమోదు చెల్లదనీ.. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు.

ఫిర్యాదు చేసిన మహిళ తరఫున న్యాయవాది జితేందర్‌ వాదనలు వినిపించారు. ఆ మహిళ కూడా స్వయంగా కోర్టుకు హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసును కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కేసును కొట్టివేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News