తెర వెనక నుంచి రంగస్థలం మీదికి వచ్చిన రామోజీ రావు

ఈనాడు పత్రిక పంథాలో మార్పు కనిపిస్తోంది. ఈనాడు పత్రిక చంద్రబాబు కంటే ఎక్కువగానే ఆవేశానికి లోనవుతోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

Advertisement
Update:2022-09-20 15:41 IST

ఈనాడు పత్రిక పంథాలో మార్పు కనిపిస్తోంది. ఈనాడు పత్రిక చంద్రబాబు కంటే ఎక్కువగానే ఆవేశానికి లోనవుతోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే జడలు విప్పే ఈనాడు.. జగన్‌ను నియంత్రించేందుకు తానే ముందుగా నియంత్రణ కోల్పోయిందని వైసీపీ విమర్శిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా జగన్‌తో నేరుగా పోరుకు రామోజీ సిద్దమైనట్టు చెబుతున్నారు.

మొన్నటివరకు వైసీపీ టీడీపీపై ఏదైనా విమర్శ చేస్తే నేరుగా తనకు తాను చొరవ తీసుకుని కౌంటర్‌ ఇచ్చే నైజం ఆంధ్రజ్యోతిలో కనిపించేది. గత వారం నుంచి ఈనాడు కూడా ఆంధ్రజ్యోతి దారిలోకి వెళ్లిపోయినట్టుగా ఉంది.

జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదిక ఇచ్చే వివరణకు ఈనాడు క్రమం తప్పకుండా తనకు తానే కౌంటర్లు అచ్చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉందని అసెంబ్లీలో జగన్ చెబితే... మరుసటి రోజు అంత బాగుంటే ఇన్ని కష్టాలెందుకో అంటూ ఈనాడే సొంత కథనం అచ్చేసింది. అసెంబ్లీలో అమరావతిపై సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని పరుష పదజాలంతో తప్పుపడుతూ బ్యానర్ ప్రచురించింది ఈనాడు. సీఎం మాటలు,.. అసలు వాస్తవాలు అంటూ సొంతంగా చొరవ తీసుకుని జగన్‌పై విరుచుకుపడింది.

పోలవరం విషయంలోనూ జగన్ ప్రసంగాన్నిఖండిస్తూ జగన్ మాటలు.. వాస్తవాలు అంటూ టీడీపీ ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటీవల జగన్‌ నేరుగా రామోజీరావుపైనా అటాక్ చేస్తుండడంతో ఈనాడు పత్రిక కూడా బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా ఉంది.

ఆఖరి వరకు పెద్ద మనిషిగా నటించి.. ఆఖరిలో దెబ్బకొట్టే ఈనాడు నైజాన్ని జగన్‌ దెబ్బకొట్టేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా సంస్థలే తమకు తాము ముసుగులు తీసేసుకుని అవును తాము జగన్‌కు వ్యతిరేకమే, చంద్రబాబుకు అనుకూలమే అని ప్రకటించే స్థితిని జగన్‌ తెచ్చారనే చెప్పాలి. మార్గదర్శి కేసు కొట్టివేయించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రామోజీరావుకు దెబ్బకొట్టింది. అప్పటి నుంచే ఈనాడు పత్రికలో జగన్‌ విషయంలో మరింత రెచ్చిపోతోందన్న అభిప్రాయం ఉంది.

Tags:    
Advertisement

Similar News