బల్క్ డ్రగ్‌ రాజకీయం- ఏపీలో అలా, తెలంగాణలో ఇలా..

16 రాష్ట్రాలు పోటీ పడగా బల్క్ డ్రగ్‌ పార్కు ఏర్పాటు అవకాశం ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు దక్కింది. రెండు వేల ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ పార్కులో అనేక పెద్దపెద్ద ఫార్మాకంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.

Advertisement
Update:2022-09-03 09:20 IST

ఏపీలో రాజకీయాలు మరీ శృతి మించిపోతున్నట్టుగా ఉంది. ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాల్సిందే అన్నట్టు ప్రతిపక్షం.. ప్రతిపక్షం అప్పట్లో ఏం చేసినా దాన్ని ఇప్పుడు ఆపాల్సిందే అన్నట్టుగా అధికార పక్షం తీరు ఉంటోంది. కాకినాడలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్‌ పార్కు విషయంలోనూ ఇదే వింత ధోరణి.

16 రాష్ట్రాలు పోటీ పడగా బల్క్ డ్రగ్‌ పార్కు ఏర్పాటు అవకాశం ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు దక్కింది. రెండు వేల ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ పార్కులో అనేక పెద్దపెద్ద ఫార్మాకంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఈ బల్క్ డ్రగ్‌ పార్కును దక్కించుకునే వరుసలో ఏపీ ముందుందని గ్రహించిన టీడీపీ మూడు నెలల ముందు నుంచే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నేరుగా యనమల రామకృష్ణుడు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖకు లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్కును తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయవద్దని.. దాని వల్ల కాలుష్యం పెరుగుతుందని అందులో వాదించారు.

టీడీపీ వైఖరి విస్మయాన్ని కలిగించింది. ఒకవేళ బల్క్ డ్రగ్ పార్కు ప్రమాదకరమైనదైతే ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలో దాన్ని ఎందుకు ఏర్పాటు చేయించుకుంటారు?. ఇప్పటికే భారీగా పరిశ్రమలు కలిగి ఉన్నా తెలంగాణ కూడా తమకెందుకు ఆ పార్కును కేటాయించలేదని నిరసన తెలుపుతుంది?. మిగిలిన రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు పూర్తయి ఉత్పత్తి ప్రారంభం కావడానికి నాలుగేళ్లు పడుతుందని.. అదే తెలంగాణలో అయితే ఇప్పటికే ఉన్న వసతుల కారణంగా ఏడాదిన్నరలోనే ఉత్పత్తి మొదలవుతుందని టీఎస్ మంత్రి కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశం ఉన్న తమ రాష్ట్రానికి ఎందుకు పార్కును కేటాయించలేదని కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

బల్క్ డ్రగ్ పార్కును కేటాయించినందుకు గుజరాత్‌లోని విపక్షాలు కూడా ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపాయి. అన్ని చోట్ల పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో ప్రతిపక్షం మాత్రం బహిరంగంగానే ఈ పార్కును రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. నిజానికి బల్క్ డ్రగ్ పార్కు అంటే సాధారణ కంపెనీలు అక్కడ యూనిట్లను ఏర్పాటు చేయవు. మెరుగైన ప్రమాణాలు కలిగి ఉండి, యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతించిన కంపెనీలు మాత్రమే అక్కడ పనిచేస్తాయి.

వ్యర్థాలు, కాలుష్యం ఏమాత్రం బయటకు వచ్చినా అనుమతులే రద్దవుతాయి. కట్టుదిట్టమైన ట్రీట్‌మెంట్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేస్తారు. అసలు హైదరాబాద్‌లో ఇప్పటికే భారీగా ఫార్మా కంపెనీలున్నాయి. తెలంగాణ మాత్రం మరిన్ని రావాలని కోరుకుంటోంది. హైదరాబాద్‌లో లేని ప్రమాదం, కాలుష్యం ఏపీ వరకే ఎలా వస్తుందని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బల్క్ డ్రగ్ పార్కును సొంతం చేసుకునేందుకు పక్కనే ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కూడా తుదివరకు ప్రయత్నించి విఫలమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News