చంద్రబాబు, పవన్‌కు షాకిచ్చిన మోడీ
తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), విశాఖపట్నంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విద్యాసంస్థలను మంగళవారం మోడీ ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తమలో తాము కుమిలిపోతున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిలదీసేంత సీన్ లేకపోవటం, ఇదే సమయంలో నరేంద్రమోడీకి సలహా ఇచ్చేంత స్థాయిలో లేకపోవటంతోనే వీళ్ళిద్దరికీ ఏమిచేయాలో తెలీక బోరముంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఏపీలో రెండు ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలను నరేంద్రమోడీ ప్రారంభించబోతున్నారు. ఈ రెండు కూడా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనివి కావటమే గమనార్హం.
తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), విశాఖపట్నంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విద్యాసంస్థలను మంగళవారం మోడీ ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించబోతున్నారు. ఈరెండు ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలకు మోడీ ప్రారంభోత్సవం చేయటం అదికూడా సరిగ్గా ఎన్నికలకు ముందు చేయటం జగన్ కు చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి. వెనుకబడిన ప్రాంతాల్లో రెండు విద్యాలయాలను ఒకేరోజు ప్రారంభమైన విషయాన్ని జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటారు. దీన్ని ఎవరు కాదనేందుకు లేదు.
ఇదే సమయంలో రెండు విద్యాలయాలు ప్రారంభించటం తమ ఘనతగా బీజేపీ చెప్పుకునే అవకాశముంది. అయితే బీజేపీ ఏమిచెప్పుకున్నా పట్టించుకునే జనాలు లేరు. రెండు విద్యాలయాల ప్రారంభోత్సవాలను వైసీపీ కచ్చితంగా తమ ఖాతాలోనే వేసుకుంటుంది. మధ్యలో టీడీపీ, జనసేన ఏమిచేయాలి..? ఇదే ఇప్పుడు చంద్రబాబు, పవన్ సమస్య. విద్యాలయాల మంజూరులో, నిర్మాణంలో, ప్రారంభంలో వీళ్ళ పాత్రేమీ లేదు. అందుకనే ఎన్నికలకు ముందు ఈ రెండు ప్రిస్టేజియస్ విద్యాలయాలను మోడీ ప్రారంభించటం వీళ్ళకు రుచించనిదనే చెప్పాలి.
రాయలసీమ పర్యటనల్లో, ఉత్తరాంధ్ర పర్యటనల్లో రెండు విద్యాలయాలను తాను సాధించుకుని వచ్చినట్లు జగన్ పదేపదే చెబుతారు. రెండు ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు కళ్ళముందు కనబడుతున్నప్పుడు దీన్ని కాదనేందుకు ఎవరికీ అవకాశం కూడా లేదు. ఈ రకంగా ఎన్నికల్లో లబ్దికి జగన్ నూరుశాతం ప్రయత్నిస్తారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ సమస్య ఏమిటంటే.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోబోతు జగన్ కు ఎన్నికల్లో ప్లస్సయేట్లుగా కేంద్రప్రభుత్వం పెద్దలు వ్యవహరించటాన్ని తట్టుకోలేకపోతున్నారు.