పేర్ని నానికి వైసీపీ ఫేర్‌వెల్.. పవన్ కళ్యాణ్ ఇక హ్యాపీ!

స్పీచ్‌లో తొలుత బందరు నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అని చెప్పుకొచ్చిన పేర్ని నాని.. గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌లను కూడా సీఎం వైఎస్ జగన్ నిలబెట్టారని గుర్తు చేశారు.

Advertisement
Update:2023-05-22 21:55 IST

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని కొన్ని రోజుల క్రితమే చెప్పేసిన పేర్ని నాని.. సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఫేర్‌వెల్ స్పీచ్ కూడా ఇచ్చేశారు. బందర్‌ పోర్ట్‌ పనులకి ఈరోజు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.

ఈ క్రమంలో మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన పేర్ని నాని ఇదే తనకి వైఎస్ జగన్‌తో కలిసి చివరి మీటింగ్ అంటూ ఎమోషనల్ అయిపోయారు. అంతేకాదు దాదాపు ముప్పావు గంట సేపు మాట్లాడి అందర్నీ పేర్ని నాని విసిగించేశారు. చివరికి వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం ఇక చాలులేవయ్యా! అంటూ వెనుక నుంచి హెచ్చరించినా పేర్ని నాని వినలేదు. ఒకరకంగా చెప్పాలంటే పేర్ని నానికి ఇది వైసీపీ ఇచ్చిన ఫేర్‌వెల్ మీటింగ్‌లా అనిపించింది.

స్పీచ్‌లో తొలుత బందరు నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అని చెప్పుకొచ్చిన పేర్ని నాని.. గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌లను కూడా సీఎం వైఎస్ జగన్ నిలబెట్టారని గుర్తు చేశారు. అలానే రాష్ట్రంలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన సీఎం దేశంలోనే ఎవరూ లేరని కితాబు ఇస్తూనే.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత తన రాజకీయ ప్రస్థానం, చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ పేర్ని నాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాంతో వేదికపై ఉన్న కొంత మంది నేతలు విసిగెత్తిపోయినట్లు కనిపించారు. చివరికి ఎమ్మెల్సీ రఘురాం చెప్పినా పేర్ని నాని వినలేదు. ఇదే తనకి వైఎస్ జగన్‌తో చివరి మీటింగ్ కావొచ్చు అంటూ ఎమోషనల్ అయ్యారు.

వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కౌంటర్ చేయడంలో వైసీపీకి పేర్ని నాని చాలా బాగా ఉపయోగపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టినా లేదా మీటింగ్‌లో మాట్లాడినా నిమిషాల్లో పేర్ని నాని మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో వైసీపీ అధినాయకత్వం కూడా పేర్ని నానిని ప్రోత్సహించింది. దాంతో పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిపోగానే.. పేర్ని నాని కౌంటర్ ఏంటి? అని మీడియా సర్కిల్‌లో చర్చ నడిచేది. పవన్‌పై విమర్శలతో పాటు సెటైర్లలోనూ పేర్ని నాని తన మార్క్‌ని క్రియేట్ చేశారు. మరోవైపు జనసేన నుంచి మాత్రం అతనికి సరైన సముజ్జీ తగల్లేదు.

కానీ.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్ని నాని ప్రకటించేశారు. ఇకపై బహిరంగ సభల్లో, ప్రెస్‌మీట్స్‌లో కనబడటం కూడా తగ్గిపోవచ్చు. ఇప్పటికే అతని కొడుకు పేర్ని కిట్టు గడప గడపకి మన ప్రభుత్వం అంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో అతనే ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News