పిఠాపురంకు పవన్.. హామీల అమలు దిశగా కీలక అడుగు
పిఠాపురం ప్రజలు విలువైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, వారి ఆకాంక్షను పవన్ కల్యాణ్ 100శాతం నెరవేరుస్తారని అన్నారు నాగబాబు.
జగన్ పులివెందులలో ఉన్నారు, రేపో మాపో చంద్రబాబు కుప్పంకు వెళ్తారు, తాజాగా పవన్ కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురంకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పార్టీ నేతలతో సమావేశాలతోపాటు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. పవన్ పర్యటన గురించి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం ప్రజలు విలువైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, వారి ఆకాంక్షను పవన్ కల్యాణ్ 100శాతం నెరవేరుస్తారని అన్నారు నాగబాబు. నియోజకవర్గంలో ప్రతి సమస్యను పవన్ పరిష్కరిస్తారన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తామన్నారు నాగబాబు. తీరప్రాంత కాలుష్య నివారణ దిశగా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం ఆయన తన శాఖలపై అవగాహన పెంచుకుంటున్నారని, రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు నాగబాబు.
గెలుపు సంబరాలు అప్పుడే..
పిఠాపురం ప్రజలకోసం ఏదో ఒకటి చేసి తర్వాత గెలుపు సంబరాలు చేసుకోవాలని పవన్ అనుకుంటున్నారని చెప్పారు నాగబాబు. టీడీపీ నేతలతో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి కొందరు నేతలు జనసేనలోకి వచ్చారని, ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశంతో వారిని తీసుకున్నామన్నారు. గత ఎన్నికల్లో కూడా కొంతమంది వైసీపీ నేతలు పరోక్షంగా జనసేన విజయానికి సహకరించారని, వారికి కూడా సముచిత ప్రాధాన్యమిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు నాగబాబు.