రేపు ఏమంటానో నాకే తెలియదు.. జగన్ పై పవన్ దారుణ వ్యాఖ్యలు
సీఎం జగన్ డిజిటల్ దొంగలా తయారయ్యారని, ప్రజల డబ్బును దోచేస్తున్నారని విమర్శించారు పవన్. జగన్ పథకాలన్నీ 70:30 పథకాలేనని మండిపడ్డారు.
జగ్గూభాయ్ అంటూ ఇటీవల సీఎం జగన్ ని సంబోధిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ ఈరోజు తణుకు సభలో జగ్గూ అంటూ మరింత దారుణంగా మాట్లాడారు. వైసీపీ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే రేపు ఏమంటానో కూడా తనకు తెలియదని మండిపడ్డారు. దత్తపుత్రుడంటూ తనను వెటకారం చేయడంపై పవన్ బాగా హర్ట్ అయి ఈ వ్యాఖ్యలు చేసినట్టుంది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారని, తాము మాత్రం గౌరవంగా మాట్లాడాలా అని ప్రశ్నించారు పవన్.
మద్యపాన ప్రియుల పొట్టకొట్టిన సీఎం జగన్ రూ.30వేల కోట్లు కొట్టేశారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. ధరలు పెంచారు కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించనప్పడు వారిని తామెందుకు గౌరవించాలని ప్రశ్నించారు. తమల్ని బానిసలుగా చూస్తే ఊరుకోబోమన్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అన్నారు పవన్.
సీఎం జగన్ డిజిటల్ దొంగలా తయారయ్యారని, ప్రజల డబ్బును దోచేస్తున్నారని విమర్శించారు పవన్. జగన్ పథకాలన్నీ 70:30 పథకాలేనని మండిపడ్డారు. 30శాతం ప్రజలకిస్తూ 70శాతం దోచుకుంటున్నారని చెప్పారు. జగన్ దోపిడీని కాగ్ సవివరంగా బయటపెట్టిందన్నారు. శివశివాని స్కూల్ లో పరీక్ష పేపర్లు ఎత్తుకొచ్చిన ఆయనకు మర్యాద ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. జగన్‌కు అబద్దాలాడి సమర్థించుకునే రోగం ఉందని ఎద్దేవా చేశారు.
జగన్ చెత్త పాలన వచ్చాకే చెత్తపన్ను వచ్చిందని, డంపింగ్ యార్డులు కట్టకుండా చెత్తపన్ను వేయడమేంటని ప్రశ్నించారు పవన్. రూ.60 మద్యాన్ని రూ.160కి పెంచారని, ఇసుక ధరను రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచారని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. జగన్ కొంపలు అంటిస్తారని, జనసేన గుండెలు మండిస్తుందని చెప్పారు పవన్.