యువగళం ముగింపు సభకు హాజరుకావడం లేదు
యువగళం ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు తాను హాజరు కావడం లేదని పవన్ కళ్యాణ్ టీడీపీ శ్రేణులకు తెలియజేశాడు. నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ముగియనుంది. నారా లోకేష్ ఇప్పటిదాకా 3వేల కి. మీ. మేర పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా పాదయాత్ర ముగిసే పోలిపల్లిలో భారీ సభ నిర్వహించేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐదు లక్షల మందితో ఈ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం టీడీపీ నాయకులు 10 రైళ్లను బుక్ చేశారు. బస్సుల కోసం ఆర్టీసీ డిపోలకు లేఖలు కూడా రాశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలివచ్చేలా రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
యువగళం ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అయితే ఈ సభకు తాను హాజరుకావడం లేదని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించారు. 20న ముందుగా నిర్ణయించుకున్న కొన్ని కార్యక్రమాలు ఉండటంతో తాను రాలేకపోతున్నట్లు పవన్ చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది.