పవన్ వన్ మ్యాన్ షో?
రాజకీయంగా బాగా పాపులర్ లేదా సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను చేర్చుకుంటే వాళ్ళు తనను ఎక్కడ డామినేట్ చేసేస్తారో అన్న స్వార్ధం వల్లే ఎవరినీ పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది. చేరిన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటానికి కూడా పవనే కారణమని సమాచారం.
వన్ మ్యాన్ షో..తను గురించి తప్ప జనాలు ఇంకెవరి గురించి మాట్లాడుకోకూడదు..తన గురించి తప్ప పార్టీలో మరో నేత గురించి మాట్లాడుకోకూడదు. ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై కాపు సమాజంలో జరుగుతున్న విస్తృతమైన చర్చ. బహుశా ఈ చర్చ నూటికి నూరు శాతం నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పవన్ పార్టీ పెట్టి సుమారు పదేళ్ళవుతున్నా ఇంతవరకు ఇతర సామాజిక వర్గాల నుండి కాదు చివరకు సొంత సామాజికవర్గం కాపుల నుండి కూడా బలమైన నేత అని చెప్పుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా చేరలేదు.
పైగా చేరుతామని వస్తున్నవాళ్ళని కూడా నాయకత్వం వద్దన్నరీతిలో వ్యవహరిస్తోంది. దీనిపైనే ఇప్పుడు కాపుల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. విషయం ఏమిటంటే పార్టీలో కానీ పార్టీకి సంబంధించి బయటకానీ తాను తప్ప మరో నేత హైలైట్ కాకూడదన్న పవన్ స్వార్ధం కారణంగానే పార్టీ ఎదగటంలేదనే చర్చ జరుగుతోంది. తాజా డెవలప్‌మెంట్‌నే తీసుకుంటే నిజమే అనిపిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఇప్పుడు కన్నా టీడీపీలో చేరుతారా? లేకపోతే ఇంకేదైనా పార్టీలో చేరుతారా అనే చర్చ ఎందుకు మొదలైంది?
ఎందుకంటే కన్నాను పార్టీలో చేర్చుకుంటే జనసేనలో మరో పవర్ సెంటర్ తయారవుతుందని పవన్ భయపడ్డారట. రాజకీయంగా బాగా పాపులర్ నేతలను చేర్చుకుంటే కచ్చితంగా వాళ్ళ వల్ల తన ఇమేజి దెబ్బతింటుందని పవన్ భయమట. రాజకీయంగా బాగా పాపులర్ లేదా సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను చేర్చుకుంటే వాళ్ళు తనను ఎక్కడ డామినేట్ చేసేస్తారో అన్న స్వార్ధం వల్లే ఎవరినీ పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది. చేరిన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటానికి కూడా పవనే కారణమని సమాచారం.
ఇక మహాసేన రాజేష్ కూడా జనసేనలో చేరటానికి రెడీ అయి చివరి నిమిషంలో టీడీపీలో చేరాడు. రాజేష్ చేరికను పవన్ చివరి నిమిషంలో వద్దన్నారట. ఏ పార్టీ అధినేత అయినా బలమైన నేతలు, మంచి ప్రజాధారణ కలిగిన నేతలను చేర్చుకోవాలని అనుకుంటారు. కానీ పవన్ మాత్రం రివర్సులో ఆలోచిస్తున్న కారణంగానే పార్టీ ఎదుగుదల లేకుండా ఆగిపోయింది. పవన్ వైఖరి వల్లే స్టేజి మీద నాదెండ్ల మనోహర్ తప్ప మరొకరు కనబడరు. మొత్తానికి మంచి వ్యూహంతోనే పవన్ ముందుకెళుతున్నారు.