అప్పటి వరకు ఆగాలా..? శిలా ఫలకాలు వేస్తున్న లోకేష్
లోకేష్ శిలా ఫలకాలపై వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి రాదు అని తెలిసి ముందుగానే లోకేష్ శిలా ఫలకాలు వేసి ముచ్చట తీర్చుకుంటున్నారని కౌంటర్లిస్తున్నారు వైసీపీ నేతలు.
ఆమధ్య నెల్లూరులో పవన్ కల్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ శిలాఫలకం వేసి కొబ్బరికాయలు కొట్టారు అభిమానులు. పవన్ ఏపీకి సీఎం అయిన తర్వాత ఫలానా పనులు చేపడతాము అంటూ పెద్ద హంగామా చేశారు. అది కాస్తా నవ్వులపాలయింది. కడప జిల్లా పర్యటనలో ఇప్పుడు నారా లోకేష్ కూడా అలాంటి కార్యక్రమాలే మొదలు పెట్టారు. ఆయన శిలా ఫలకాలు వేస్తున్నారు. అయతే భావి మంత్రి, భావి ముఖ్యమంత్రి లాంటి ట్యాగ్ లైన్లేవీ లేకుండానే లోకేష్ శిలా ఫలకాలు రెడీ చేస్తున్నారు. తాజాగా కడప నగరంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థకోసం శిలా ఫలకాన్ని వేశారు నారా లోకేష్.
యువగళం యాత్ర 1500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ శిలా ఫలకం వేశారు లోకేష్. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కడప నగరంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అంటూ కింద కొటేషన్ ఎందుకు..? పోనీ తాము అధికారంలోకి వస్తే ఈ మెరుగైన డ్రైనేజీ అనేది తమ హామీ అని చెప్పడానికా..? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది. వచ్చే దఫా అధికారం గ్యారెంటీ అనే ఉద్దేశంతోనే లోకేష్ ఇలా శిలా ఫలకాలు వేసుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
వైసీపీ సెటైర్లు..
లోకేష్ శిలా ఫలకాలపై వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి రాదు అని తెలిసి ముందుగానే లోకేష్ శిలా ఫలకాలు వేసి ముచ్చట తీర్చుకుంటున్నారని కౌంటర్లిస్తున్నారు వైసీపీ నేతలు. కడపలో యువగళం సక్సెస్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారని, అసలు యాత్రలో జనాలే లేరని అంటున్నారు. మైలు రాళ్లు అంటూ హడావిడి చేయడం మినహా లోకేష్ యాత్రలో ప్రత్యేకత ఏమీ లేదని వెటకారం చేస్తున్నారు.