జనసేనలో నాదెండ్ల మనోహర్ గ్రూపు పాలిటిక్స్
నాదెండ్ల రాష్ట్రవ్యాప్తంగా తన కోటరీని బలోపేతం చేసుకుంటున్నారని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. తనకేమీ తెలియదంటూనే కొన్ని జిల్లాలు, కీలక నియోజకవర్గాలలో తన మనుషులను మొహరించుకుంటున్నారని గుర్రుగా ఉన్నారు నేతలు.
జనసేన ఒక్క సీటు గెలిచిన పార్టీ. ఒకే ఒక్క నాయకుడి కనుసన్నల్లో నడిచే పార్టీ. వ్యూహకర్త, స్టార్ క్యాంపెయినర్, పొత్తు చర్చలకీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇటువంటి జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ నెంబర్ 2 అనిపించుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లు తప్పించి, ఇతర ఏ రాజకీయ కార్యక్రమం అయినా నాదెండ్ల మనోహర్ తప్పనిసరి.
రాష్ట్ర విభజన సమయంలో సమీకరణాలు అన్నీ కలిసొస్తే ముఖ్యమంత్రి కూడా అవుదామనుకున్న నాదెండ్ల మనోహర్‌కి అప్పట్లో స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన గతచరిత్ర ఇప్పుడు జనసేనలో ఒకరకమైన భయాందోళనకు కారణం అవుతోంది.
జనసేన కీలక నేతలకి పవన్ కళ్యాణ్ దర్శనం దొరకడం గగనం అవుతోంది. జనసేనలో నెంబర్ 2 అనిపించుకుంటోన్న నాదెండ్ల మనోహర్‌ను కలవడం అసాధ్యంగా ఉందంటున్నారు. పవన్ సోదరుడు నాగబాబు దగ్గరకి వెళ్లడానికి నేతలు సాహసించడంలేదు. ప్రజారాజ్యంలో నాగబాబుపై వచ్చిన ఆరోపణలనే చాలా మంది నేతలు ఇంకా నమ్ముతున్నారు.
ఏ నియోజకవర్గం పొత్తులో తమకి వస్తుందో తెలియదు. అసలు బీజేపీతో ఉంటారో, టిడిపి అలయెన్స్ ఉంటుందో రాష్ట్ర స్థాయి నేతలే చెప్పలేని పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టుకుని చివరికి బీజేపీ కోసం, టిడిపి కోసం పనిచేయాల్సి ఉంటుందనే ఆందోళన జనసేన నేతల్లో నెలకొంది. తమ సీటు గురించి, పార్టీ పోటీ గురించి క్లారిటీ కోసం ఎవరిని అడగాలో తెలియదు. అధినేత దీనిపై ఏం మాట్లాడరు. నెంబర్ 2 మనోహర్ దగ్గర ఆ ఊసు ఎత్తితే అంతా సార్ చూసుకుంటారని చెబుతుంటారు. తమతో ఏమీ తెలియనట్లు చెబుతున్న నాదెండ్ల రాష్ట్రవ్యాప్తంగా తన కోటరీని బలోపేతం చేసుకుంటున్నారని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. తనకేమీ తెలియదంటూనే కొన్ని జిల్లాలు, కీలక నియోజకవర్గాలలో తన మనుషులను మొహరించుకుంటున్నారని గుర్రుగా ఉన్నారు నేతలు.