ముందు నీది నువ్వు కడుక్కో- విజయసాయిరెడ్డిపై వైసీపీ ఎంపీ ఫైర్
విజయసాయిరెడ్డి కుటుంబసభ్యుల ఆస్తుల గురించి మీడియాలో వచ్చిన కథనాలకు సమాచారం తానే అందించాన్న ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని ఎంవీవీ విమర్శించారు.
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై సొంత పార్టీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. `ఇదే విశాఖ కూర్మన్నపాలెంలో ఒక వెంచర్ నడుస్తోంది.. అక్కడ ఏకంగా బిల్డర్ 99 శాతం వాటా తీసుకుని కేవలం ఒక శాతం మాత్రమే భూయజమానులకు ఇచ్చారు` అంటూ కొత్త అంశాన్ని లేవనెత్తారు. మరి దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ విజయసాయి మీడియాను నిలదీశారు. ఆ వెంచర్ వైసీపీ లోక్‌సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణదే కావడంతో వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో ఆంగ్ల దినపత్రికకు ఎంవీవీ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను తన వెంచర్‌ను ప్రైవేట్ భూముల్లో నిర్మిస్తున్నానే కానీ.. ఎవరి వద్ద లాక్కున్న భూముల్లో కాదని, ప్రభుత్వ భూముల్లో కాదని ఎంవీవీ వ్యాఖ్యానించారు. దసపల్లా భూ వివాదంపై స్పందించిన లోక్‌సభ ఎంపీ.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీపై వైసీపీ యుద్ధం చేస్తోందని.. విజయసాయిరెడ్డి కుమార్తె కుటుంబం కూడా విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో భూములు కొన్నారని.. అమరావతి వ్యవహారానికి ఇక్కడ భూ కొనుగోళ్లకు తేడా ఏముందని వైసీపీ లోక్‌సభ ఎంపీ ప్రశ్నించారు.
తన కూతురిది ధనవంతుల కుటుంబమని విజయసాయిరెడ్డి చెబుతున్నారు కదా అని ప్రశ్నించగా.. దసపల్లా భూముల స్వరూపాన్ని ఒకసారి పరిశీలించాలన్నారు. భూములు దక్కించుకునేందుకు అతడి మనుషులు ఉపయోగించే పద్దతులూ అందరికీ తెలుసని ఎంవీవీ వ్యాఖ్యానించారు.
అసలెందుకు మీ మధ్య విబేధాలు వచ్చాయని ప్రశ్నించగా.. విజయసాయిరెడ్డికి గులాంగిరి అంటే ఇష్టమని.. తాను అలా గులాంగిరి చేసే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేసే ముందు విజయసాయిరెడ్డి తన చేతులకు అంటిన మురికిని శుభ్రం చేసుకోవాలన్నారు. తాను ఆత్మగౌరవంతో బతికే వ్యక్తినని.. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని.. కూర్మన్నపాలెం వెంచర్ ఒప్పందం కూడా 2017లోనే కుదిరిందన్నారు.
విజయసాయిరెడ్డి కుటుంబసభ్యుల ఆస్తుల గురించి మీడియాలో వచ్చిన కథనాలకు సమాచారం తానే అందించాన్న ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని ఎంవీవీ విమర్శించారు. రెచ్చగొడితే రియల్ వ్యాపారంలోకి వస్తానన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎంవీవీ.. రియల్ వ్యాపారం, మీడియా రంగంలోకి వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి.. కొత్త పార్టీ కూడా పెడుతానని ప్రకటించడమే ఇక మిగిలి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.