యనమలవి పిల్లి శాపాలు.. - మంత్రి బుగ్గన వ్యంగాస్త్రాలు

‘వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తోంది. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం టీడీపీ నేతలు చూడలేకపోతున్నారు. అందుకే నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏపీలో ప్రజలకు సంక్షేమం అందుతోంది’ అని బుగ్గన పేర్కొన్నారు.

Advertisement
Update:2022-10-09 14:49 IST

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిల్లి శాపాలు పెడుతున్నారని.. ఆయన శాపాలకు ఉట్లు తెగిపడవని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ఇటీవల యనమల రామకృష్ణుడు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మంత్రి బుగ్గ‌న‌ కౌంటర్ ఇచ్చారు.

'వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తోంది. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం టీడీపీ నేతలు చూడలేకపోతున్నారు. అందుకే నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏపీలో ప్రజలకు సంక్షేమం అందుతోంది' అని బుగ్గన పేర్కొన్నారు.

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడేమో నైజీరియా..

'కొద్ది నెలల క్రితం ఏపీ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో.. నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల దృష్టి మొత్తం ప్రపంచంలో ఎక్కడ వికృత చేష్టలు చోటుచేసుకుంటున్నాయో.. ఎక్కడెక్కడ అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయో అక్కడే ఉంటున్నట్లుగా ఉంది.

సానుకూల దృక్పథం అనేది వారి డిక్షనరీలోనే ఉన్నట్లుగా లేదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పనిలో నిరంతరం మేం నిమగ్నమై ఉంటే మాపై రాళ్లేయడమే ఈ బ్యాచ్‌ పనిగా కనిపిస్తోంది.' అంటూ బుగ్గన విమర్శలు గుప్పించారు.

కొవిడ్ సంవత్సరం గురించి పదే పదే ప్రస్తావన

'యనమల 2020-21 సంవత్సర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే పదే పదే మాట్లాడతారు. అది కరోనా సంవత్సరం అని చెప్పినా కూడా పదే పదే ఆ సంవత్సరం గురించే మాట్లాడతారు. కరోనాను ఎదుర్కొని ప్రజలను కాపాడుకొని 2021-22 లో మెరుగు చెందితే టీడీపీ నాయకులు మాత్రం కరోనా సంవత్సరం కష్టాలు ఉండాలని కోరుకుంటున్నారు.

2020–21 సంవత్సరంలో ఎందుకిలా జరిగిందో.. రాష్ట్ర ప్రజలకు తెలియని అంశం కాదు. ఆనాడు కోవిడ్‌ మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించింది. మన రాష్ట్రంలో కూడా విలయతాండవం చేసింది. రాష్ట్రంలో జనజీవితం అతలాకుతలం అయింది. తత్ఫలితంగా ఆదాయ వనరులకు బాగా గండి పడింది.' అంటూ బుగ్గన కౌంటర్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News