అన్ని ప్రాంతాలు బాగుండాలి, అందులో అమరావతి ఉండాలి..
పాదయాత్ర విరామ సమయంలో 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవని చెప్పారు మంత్రి అమర్నాథ్. యాత్రలో పాల్గొన్నవారు, స్థానికుల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు అమరావతి రైతులు మద్దతు తెలిపితే వారి అరికాలు కూడా కిందపెట్టనీయకుండా అరసవెల్లి తీసుకెళ్తామని ప్రకటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నంతోపాటు అమరావతి కూడా బాగుండాలనేదే తమ కోరిక అన్నారు. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందేనని చెప్పారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో తాము వచ్చామని, ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా తాము కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. అవసరం అయితే ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని అన్నారు అమర్నాథ్.
హైకోర్టు అనుమతి ఇచ్చిన 600మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలంటూ ధర్మాసనం స్పష్టం చేసిందని, అయితే రైతులు మాత్రం ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు మంత్రి అమర్నాథ్. పాదయాత్ర విరామ సమయంలో 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవని చెప్పారాయన. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. యాత్రలో పాల్గొన్నవారు, స్థానికుల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రేపు ఏపీ హైకోర్టులో విచారణ..
అమరావతి మహా పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ సహా, అన్ని పిటిషన్లపై రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది. సంఘీభావం తెలపడానికి వచ్చే వారికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సవరించాలంటూ రైతులు కోరారు. అయితే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పాదయాత్రలో అనుమతించిన 600 మాత్రమే పాల్గొనాలని తేల్చిచెప్పింది. పాదయాత్ర రద్దు పిటిషన్ పై రేపు విచారణ జరుగుతుంది.