ప్రైవేట్ ఫ్లైట్‌లో విజయవాడకు లోకేశ్, పీకే.. ఇంకా ఎవరెవరంటే.?
లోకేశ్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన ప్రైవేట్ ఫ్లైట్.. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ కంపెనీ బీజేపీ నేత సీఎం రమేష్, ఆయన తనయుడు రిత్విక్ పేరున ఉంది.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఐ-ప్యాక్ ఓనర్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పని చేయబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన ప్రైవేట్ ఫ్లైట్‌లో లోకేశ్ వెంట విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.
లోకేశ్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన ప్రైవేట్ ఫ్లైట్.. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ కంపెనీ బీజేపీ నేత సీఎం రమేష్, ఆయన తనయుడు రిత్విక్ పేరున ఉంది. సీఎం రమేష్ బీజేపీలో చేరినప్పటికీ.. ఇంకా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారన్న వైసీపీ నేతల ఆరోపణలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూర్చాయి.
ఇక ఈ ఫ్లైట్‌లో నారా లోకేశ్‌తో పాటు ప్రశాంత్ కిశోర్.. మరో ముగ్గురు సభ్యులు కూడా విజయవాడ చేరుకున్నారు. వారిలో నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేశ్ కిలారుతో పాటు ఐ-ప్యాక్ టీమ్ సభ్యుడు శంతను సింగ్, ఎం. శ్రీకాంత్ ఉన్నారు.