మహిళ హత్య.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
కొత్త డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా బాధ్యతల స్వీకరణ అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా హత్యోదంతం చర్చకు వచ్చింది.
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని గతంలో ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఉదాహరణలున్నాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. దీంతో సీఎం చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా చూడాలని, వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆయన పోలీసుల్ని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి వంగలపూడి అనితకు సూచించారాయన. సీఎం సూచనతో హోం మంత్రి ఈపురుపాలెం వెళ్లారు.
మరోవైపు కొత్త డీజీపీ ద్వారకా తిరుమల రావు కూడా బాధ్యతల స్వీకరణ అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా హత్యోదంతం చర్చకు వచ్చింది. బాపట్ల జిల్లాలో జరిగిన దారుణ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు చంద్రబాబు. బాధితులకు భరోసా ఇవ్వాలని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసేవారో, ఇప్పుడు తమ ప్రభుత్వంపై అలాంటి నిందలు పడకూడదని అనుకుంటున్నారు చంద్రబాబు. అందుకే ఇలాంటి ఘటనలపై ఆయన నేరుగా రియాక్ట్ అవుతున్నారు. బాపట్ల జిల్లాలో మహిళ హత్య గురించి సమాచారం తెలియగానే ఆయన వెంటనే స్పందించారు. హోం మంత్రిని, డీజీపీని అలర్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున భరోసా ఇవ్వాలని కోరారు. బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.