చంద్రబాబు ఇక శాశ్వతంగా ఎక్స్‌ సీఎంగానే ఉంటాడు

తనకు, వంశీకి సీటు లేదన్న అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా చేస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగా ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

Advertisement
Update:2024-02-20 08:19 IST

చంద్రబాబు ఇక జీవితాంతం మాజీ సీఎంగానే ఉంటాడని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. పేద ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇకపై శాశ్వతంగా సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌ సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌లవంటివి చేసుకోవాలనుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రులపైనే చేసుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. సంక్షేమాభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు నిర్విరామంగా అందిస్తున్న జగన్‌పై ఛాలెంజ్‌ చేసే హక్కు బాబుకు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు.

తనకు, వంశీకి సీటు లేదన్న అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా చేస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాల్లో భాగంగా ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఎవరో సిఫారసు చేస్తేనో.. బ్రోకర్‌ పనులు, పైరవీలు చేస్తేనో.. డబ్బుందనో వైసీపీలో జగన్‌ సీట్లు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో అయితే వారి మీడియా ఛానళ్లే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తున్నాయన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో తమకు సీఎం జగనే చెబుతారని, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, పౌడర్‌ డబ్బాగాళ్లు కాదన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ ఆదేశిస్తే పోటీ చేస్తామని.. మధ్యలో ఈ పకోడీగాళ్లెవరని ప్రశ్నించారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రికి రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేశాడన్నారు. దమ్ముంటే తనను ఓడించడానికి చంద్రబాబు గుడివాడ అభ్యర్థిగా రావాలని నాని ఈ సందర్భంగా ఛాలెంజ్‌ చేశారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలా బాబు మగాడైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని కొడాలి నాని చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వ్యక్తులకు జగన్‌ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లయితే.. చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు ఆయన తీరు ఉందని, వాటిని ఎల్లోమీడియా కథనాలుగా ప్రసారం చేస్తుందని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News