సొంత అప్పులు తీర్చే టికానా లేదు.. ఏపీ అప్పులు తీరుస్తాడంట..

తాజాగా ఆయన తనకు అప్పు ఉన్నాడని, ఆ బాకీ తీర్చమంటే మొహం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ.. కాకినాడలో రత్నకుమార్ అనే వ్యక్తి పాల్ కార్లను స్వాధీనం చేసుకున్నాడు.

Advertisement
Update:2022-07-28 13:35 IST

"నాకు ప్రపంచ దేశాల అధ్యక్షులంతా తెలుసు, నా పార్టీని గెలిపిస్తే, నన్ను సీఎం చేస్తే.. ఏపీ అప్పు మొత్తం ఒక్క క్షణంలో తీర్చేస్తా, భారత్‌లో నిధుల వరద పారిస్తా.." సహజంగా ప్రతి మీటింగ్ లోనూ కేఏ పాల్ వల్లె వేసే మాటలే ఇవి. ఇంతకీ పాల్ కి ఎంతమంది దేశాధ్యక్షులు తెలుసో..? వారిలో పాల్ కి ఎవరెవరు ఎంత నిధులిస్తారో..? వాటితో పాల్ ఏం చేస్తారనేది ఆయనకి మినహా మిగతా ఎవ్వరికీ తెలియదు. ఇలా తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశం అప్పు సైతం తీర్చేస్తానని చెప్పుకునే పాల్ ఇప్పుడు నిజంగానే అప్పులోళ్లకు అడ్డంగా బుక్కయ్యారు. తీసుకున్న డబ్బులు తిరిగివ్వకపోయే సరికి అప్పులవాళ్లు పాల్ దగ్గర కార్లు రికవరీ చేశారు. ఆయన రెండు కార్లు అప్పులిచ్చినవారు తీసుకెళ్లిపోయారు. కాన్వాయ్ లేకపోతే తన పర్యటనలు కళ తప్పుతాయని అనుకున్న పాల్.. ఎలాగైనా వాటిని విడిపించుకు రావాలంటూ తన వస్తాదుల్ని పంపారు. పాల్ పంపించిన బౌన్సర్లకు, అక్కడ పాల్ బాకీ ఉన్నాడని చెబుతున్న వారికి మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

గత ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ టికెట్ ఇస్తానంటూ కేఏ పాల్ తమని మోసం చేశారని చాలామంది ఫిర్యాదులు చేశారు. అయితే ఆ వ్యవహారం పోలీస్ కేసుల వరకు వెళ్లలేదనుకోండి. తాజాగా ఆయన తనకు అప్పు ఉన్నాడని, ఆ బాకీ తీర్చమంటే మొహం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ.. కాకినాడలో రత్నకుమార్ అనే వ్యక్తి పాల్ కార్లను స్వాధీనం చేసుకున్నాడు. బాకీ తిరిగివ్వాలని అడిగితే పాల్ తమను బెదిరిస్తున్నాడని కూడా ఆయన ఆరోపించారు. పాల్‌ కాన్వాయ్‌ లో ఉండే రెండు కార్లను రాత్రి రత్నకుమార్‌ తన షెడ్‌ లో తీసుకెళ్లి పెట్టుకున్నాడు.

ఈరోజు ఉదయం ఆ కార్లను తీసుకొచ్చేందుకు పాల్‌ డ్రైవర్లు వెళ్లగా, రత్నకుమార్‌ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్లు తిరిగి వెళ్లిపోయారు. పాల్‌ డబ్బులు ఇచ్చాకే కార్లు తిరిగిస్తానంటూ రత్నకుమార్ చెప్పడంతో ఈసారి పాల్ బౌన్సర్లను పంపించారు. వారు కాస్త హడావిడి చేశారు బలవంతంగా కార్లు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. రత్నకుమార్ అనుచరులకు, పాల్ పంపించిన బౌన్సర్లకు మధ్య‌ గొడవ జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

Advertisement

Similar News