మాకు నమ్మకం లేదు జగన్.. కర్నూలులో స్టిక్కర్ల కలకలం
వాళ్లు అటు వెళ్లగానే జనసేన ఇలా పోటీగా స్టిక్కర్లు వేసి వస్తోంది. కర్నూలు నగరంలో కొన్ని వీధుల్లో ఈ స్టిక్కర్లు కనపడ్డాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అధికార పార్టీ నేతలు ప్రతి ఇంటికీ వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు అంటించి వస్తున్నారు. ప్రజల అనుమతితోనే ఆ పని చేస్తున్నామని, వారికి ఇష్టం ఉంటేనే అంటిస్తున్నామని అంటున్నారు. స్టిక్కర్ అంటించిన ప్రతి ఇంటికీ జగన్ పై నమ్మకం ఉందని, ఆ ఇంట్లో ఓట్లన్నీ వచ్చే ఎన్నికల్లో తమవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పోటీగా మరో ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. "మాకు నమ్మకం లేదు జగన్.. మాకు నమ్మకం పవన్" అంటూ జనసేన నేతలు స్టిక్కర్లు అంటిస్తున్నారు. సరిగ్గా వైసీపీ వాళ్లు అంటించిన స్టిక్కర్లపైనే జనసేన కూడా వాటిని అతికిస్తోంది.
కర్నూలులో మొదలు..
కర్నూలులో జనసేన నేతలు ఇలా పోటా పోటీ స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టారు. వైసీపీ వాళ్లు ఓ బ్యాగ్ తగిలించుకుని, ఇంట్లోకి వెళ్లి ప్రశ్నలు అడిగి సమాధానాలు విని, వారి అనుమతితో స్టిక్కర్లు వేస్తున్నారు. వాళ్లు అటు వెళ్లగానే జనసేన ఇలా పోటీగా స్టిక్కర్లు వేసి వస్తోంది. కర్నూలు నగరంలో కొన్ని వీధుల్లో ఈ స్టిక్కర్లు కనపడ్డాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో ఎన్నికల ప్రచారంలో గోడమీద స్లోగన్లు, వాల్ పోస్టర్లు కనపడేవి. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బ్యానర్ల కాలం మొదలైంది. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎవరి డప్పు వాళ్లు కొట్టుకుంటూనే.. పోటీగా పక్కనోళ్లపై వ్యతిరేక ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టే సరికి, జనసేన కూడా పోటీకి దిగింది. మరి ఈ స్టిక్కర్ల వ్యవహారంపై వైసీపీ స్పందిస్తుందా.. సీఎం జగన్ కి వ్యతిరేకంగా స్టిక్కర్లు అంటించినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, విమర్శలతో సరిపెడుతుందా.. వేచి చూడాలి.