పవన్ ఇప్పుడెందుకు నియమించారు?
ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు సడెన్‌గా మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలు విచిత్రంగా ఉంటున్నాయి. ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు సడెన్‌గా మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టీవీ రామారావును నియమించారు. వారాహియాత్ర జరిగిన సమయంలో ఏమీ మాట్లాడకుండా కనీసం నేతలను తన వాహనంపైకి కూడా పవన్ ఆహ్వానించలేదు. అలాంటిది తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగిసిన ఇన్నిరోజులకు సడెన్‌గా పిఠాపురానికి తంగెళ్ళని ఇన్‌చార్జిగా నియమించటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకాలం పిఠాపురంలో యాక్టివిటీస్ చేస్తున్నది మాకినీడి శేషుకుమారే. పోయిన ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన ఈమెకు 28 వేల ఓట్లొచ్చాయి. అందుకనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మళ్ళీ తనకే ఇవ్వకపోతారా అనే ఆలోచనతోనే శేషుకుమారి పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. టీడీపీతో పొత్తుంటే పిఠాపురంలో కచ్చితంగా పోటీ చేసే అవకాశం జనసేనే తీసుకోవాలని, తనకే టికెట్ ఇవ్వాలని గతంలోనే ఈమె పవన్‌ను కోరారు. ఒకవైపు ఆమె నియోజకవర్గంలో పనిచేసుకుంటుండగానే తంగెళ్ళని ఇన్‌చార్జిగా నియమించేశారు.
రాజానగరం ఇన్‌చార్జిగా నియమించిన బత్తుల బలరామకృష్ణ యువకుడు, ఉత్సాహంగానే పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక కొవ్వూరులో టీవీ రామారావు మాజీ ఎమ్మెల్యే. ఈయన 2009లో టీడీపీ తరపున గెలిచారు. తర్వాత ఈయనపై విపరీతంగా అవినీతి ఆరోపణలు రావటంతో పార్టీకి దూరమైపోయారు. మళ్ళీ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాంటిది కొంతకాలం క్రితం జనసేనలో ప్రత్యక్షమయ్యారు. వెంటనే పవన్ ఈయన్‌ను నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించేశారు.
పిఠాపురం, కొవ్వూరు ఇన్‌చార్జిల విషయంలో పార్టీలో అప్పుడే అసంతృప్తులు మొదలైపోయాయి. టీవీని నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించటంపై పార్టీ నేతలే అధికారిక ట్విట్టర్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఒకవైపు టీడీపీతో పొత్తుంటుందో లేదో తెలియని అయోమయం కంటిన్యూ అవుతోంది. వారాహియాత్ర జరిగిన నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇన్‌చార్జిలను నియమించలేదు. మరి ఇప్పుడు మాత్రం పైమూడు నియోజకవర్గాల్లో ఎందుకు ప్రకటించారో ఎవరికీ అర్థంకావటంలేదు. పొత్తులున్నా ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులే పోటీ చేయబోతున్నారని అనుకోవాలా?