అందరూ ముద్రగడ చుట్టే తిరుగుతున్నారా..?
ముద్రగడ మద్దతుకోసం రెండు పార్టీలు, రెండు సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. కాపుసత్తా చాటడం కోసమే విశాఖలో కాపునేతలు, ప్రముఖులతో భారీ బహిరంగసభ జరగబోతోంది.
రెండు పార్టీలు, కుల సంఘాలు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చుట్టే తిరుగుతున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వాళ్ళుండరు. అందుకనే ఈ మాజీమంత్రి ప్రాపకం సంపాదిస్తే తమకు తిరుగుండదనే ఉద్దేశ్యంతో జనసేన, వైసీపీలు ఆయన మద్దతుకోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. పనిలో పనిగా ఈనెల 26వ తేదీన వైజాగ్ లో జరగబోయే కాపునాడు సమావేశానికి ముద్రగడను రప్పించాలని ఆ సంఘం పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే సమయంలో ఒక్కరోజు ముందు డిసెంబర్ 25వ తేదీన అనకాపల్లిలో జరగబోయే కాపు పిక్నిక్ కు కూడా ముద్రగడను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ముద్రగడ మద్దతుకోసం రెండు పార్టీలు, రెండు సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. కాపుసత్తా చాటడం కోసమే విశాఖలో కాపునేతలు, ప్రముఖులతో భారీ బహిరంగసభ జరగబోతోంది. పేరుకు వంగవీటి రంగా వర్ధంతే.. కానీ కాపుల సత్తా చాటడమే అసలు వ్యూహం. ఈ సమావేశానికి ముద్రగడ హాజరయ్యేట్లు చేయాలని నిర్వాహకులు గట్టిపట్టుదలతో ఉన్నారు.
నిజానికి ముద్రగడ కూడా కాపునేతే కాబట్టి ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరంలేదు. అయినా ప్రయత్నాలు చేస్తున్నారంటే.. ఆయన వస్తారో, రారో అనే అనుమానాలున్నట్లున్నాయి. ఎందుకంటే 26న మీటింగుకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ను కూడా పిలిపించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. పవన్-ముద్రగడ మధ్య మాటల్లేవట. అందుకనే నిర్వాహకులు అందరికోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక డిసెంబర్ 25వ తేదీన ఉత్తరాంధ్రలోని తూర్పుకాపు నేతలు, ప్రముఖుల భేటీ జరగబోతోంది. 26వ తేదీ జరగబోయే బహిరంగసభకు తమకు ఎలాంటి సంబంధంలేదని ఇప్పటికే తూర్పుకాపునేతలు ప్రకటించారు. తూర్పుకాపులతో సంబంధం లేకపోయినా ముద్రగడను ప్రత్యేకంగా పిలిపించాలని వైసీపీలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. పవన్ తో మంచి సంబంధాలు లేవు కాబట్టి ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించేందుకు పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయి. మొత్తానికి పార్టీలు, కాపుసంఘాలు ముద్రగడ చుట్టు తిరుగుతున్నది అయితే వాస్తవం. మరి చివరకు ఆయన ఏమిచేస్తారో చూడాలి.