వారాహి వల్ల చంద్రబాబుకే నష్టమా?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పవన్ అనవసరంగా కెలికారు. దాంతో కాపు నేతల్లో అత్యధికం ముద్రగడ వర్సెస్ పవన్ అన్నట్లుగా విడిపోతున్నారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది మాత్రం టీడీపీనే.

Advertisement
Update:2023-06-26 10:38 IST

వారాహి వల్ల చంద్రబాబుకే నష్టమా?

ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లయిపోయింది చంద్రబాబునాయుడు వ్యవహారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోవాని చంద్రబాబు అనుకుంటున్నదే కాపుల ఓట్ల కోసం. అలాంటి కాపుల ఓట్లు మళ్ళీ పవన్ వల్లే దూరమవుతాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన ఎన్నికల్లో కాపుల ఓట్లు టీడీపీకి పెద్దగా పడలేదు. పవన్ లెక్క ప్రకారం ప్రతి వంద కాపుల ఓట్లలో వైసీపీకి 60, జనసేనకు 30 పడ్డాయి. మిగిలిన 10 ఓట్లే టీడీపీకి పడ్డాయి. అందుకనే రాబోయే ఎన్నికల్లో 100కి 100 ఓట్లు టీడీపీతో కలిసిన జనసేనకే పడాలన్నది పవన్ ప్లాన్.

బయటకు చెప్పకపోయినా చంద్రబాబు కూడా ఈ ఆలోచనతోనే పవన్‌తో పొత్తు పెట్టుకుంటుంది. కానీ వారాహి యాత్ర మొదలైన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీకి మళ్ళీ కాపుల ఓట్లు దూరమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను అనవసరంగా పవన్ కెలికారు. దాంతో కాపు నేతల్లో అత్యధికం ముద్రగడ వర్సెస్ పవన్ అన్నట్లుగా విడిపోతున్నారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది మాత్రం టీడీపీనే.

ముద్రగడపైకి పవన్‌ను ఉసిగొలిపిందే చంద్రబాబు అన్న ఆరోపణలు పదేపదే వినబడుతున్నాయి. పోయిన ఎన్నికల్లో కాపుల్లో అత్యధికులు వైసీపీకి మద్దతుగా నిలబడటానికి పరోక్షంగా ముద్రగడ కూడా కారణమన్న మంట చంద్రబాబులో ఉంది. ఆ మంటను ఇప్పుడు పవన్ ద్వారా తీర్చుకుంటున్నారనే ప్రచారం బాగా పెరిగిపోయింది. పైగా చంద్రబాబును సీఎం చేయటానికే పవన్ తాపత్రయపడుతున్నారనే ఆరోపణ ఎప్పటినుండో ఉన్నదే.

చంద్రబాబును సీఎం చేయటానికి కాపులెందుకు ఓట్లేయాలనే చర్చలు జోరుగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ అనవసరంగా ముద్రగడపై నోటికొచ్చింది మాట్లాడారు. దాంతో కాపుల ఓట్ల కోసం పవన్‌ను ముందుపెట్టి తెరవెనుక నుండి చంద్రబాబు వేసుకున్న ప్లాన్లు అన్నీ బెడిసికొట్టేట్లున్నాయి. కాపుల్లో చంద్రబాబు చిచ్చుపెడుతున్నారంటు గోల పెరిగిపోతోంది. చూస్తుంటే వారాహియాత్ర వల్ల నష్టపోయేది చంద్రబాబేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ భయంతోనే టీడీపీ కాపు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయడు, చినరాజప్ప నోరిప్పటంలేదు. తన యాత్రతో కాపుల ఓట్లన్నింటినీ కన్సాలిడేట్ చేయించి జనసేన+టీడీపీలకు పవన్ వేయిస్తారని అనుకుంటే చివరకు ఉన్నది కూడా ఊడిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News