జనసైనికుల తిరుగుబాటు

యువగళం ముగింపు సభకు పవన్‌కల్యాణ్ హాజరుకావడం.. ఆ సభలో పవన్‌కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌పైనా జనసైనికులు మండిపడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు గడుస్తున్నా.. ఇంకా పార్టీ నడిపే విషయంలో పవన్‌కల్యాణ్‌కు ఓ స్పష్టత లేదంటున్నారు.

Advertisement
Update:2023-12-22 22:15 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు జనసైనికులు ఎదురుతిరుగుతున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు అంశాన్ని పైకి స్వాగతిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం జనసేన కార్యకర్తలు తీవ్రంగా మదనపడుతున్నారు. జనసేనానిని సీఎంగా చూడాలనుకుంటున్న జనసైనికులు.. సీట్ల పంపకాలు, సీఎం పదవి విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండా బేషరతుగా టీడీపీకి మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో పదేళ్ల పాటు టీడీపీతో పొత్తు కొనసాగాలని పవన్‌కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌ కూడా జనసైనికుల ఆవేదనకు కారణమయ్యాయి. పవన్‌కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా యువగళం ముగింపు సభకు పవన్‌కల్యాణ్ హాజరుకావడం.. ఆ సభలో పవన్‌కల్యాణ్‌ చేసిన కామెంట్స్‌పైనా జనసైనికులు మండిపడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు గడుస్తున్నా.. ఇంకా పార్టీ నడిపే విషయంలో పవన్‌కల్యాణ్‌కు ఓ స్పష్టత లేదంటున్నారు. కొద్దిగా అటు.. ఇటుగా అదే టైంలో పార్టీ స్థాపించిన జగన్‌.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని.. పవన్‌కల్యాణ్ మాత్రం ఇంకా పక్క పార్టీల జెండాలు, ఎజెండాలు మోస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీని నిర్మించడంలో, గ్రామస్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడంలో పవన్‌ పూర్తిగా ఫెయిల్‌ అయ్యారని అంటున్నారు.


ఇందుకు ఉదాహరణగా.. జగన్‌ పుట్టిన రోజు వేడుకల్లో జనసేన నేతలు పాల్గొన్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన కార్యకర్తలు పరోక్షంగా పవన్‌కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. యువగళం ముగింపు అనే పెద్దమనిషి ఫంక్షన్ జరిగితే.. పెద్ద ముత్తయిదువుగా పవన్‌కల్యాణ్.. పండు ముత్తయుదువుగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారంటూ చురకలు అంటించారు. సొంతంగా పార్టీ ఉన్నా కూడా పక్క పార్టీలకు ఎలా సపోర్టు చేస్తున్నామో.. అదే తరహాలో అభివృద్ధి చేస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో తాము పాల్గొన్నామంటూ చెప్పుకొచ్చారు.

కనీసం ఇప్పటికైనా పవన్‌ తన వైఖరి మార్చుకుని.. కార్యకర్తలు, నేతలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు జనసైనికులు. మొండిగా వెళ్తే పరువు పొగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News