నేడు వినుకొండకు జగన్.. పోలీసులు అప్రమత్తం
ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వైసీపీ అధినేత జగన్ నేడు వినుకొండకు వస్తున్నారు. దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఈ దారుణం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు బాసటగా నిలిచారు. వారినుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు జగన్. కుటుంబ సభ్యులతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడి వారిని పరామర్శించారు. బెంగళూరు పర్యటనను కూడా రద్దు చేసుకుని గురువారం తాడేపల్లికి చేరుకున్నారు. ఈరోజు ఆయన తాడేపల్లి నుంచి వినుకొండకు వస్తారు. రషీద్ కుటుంబాన్ని నేరుగా పరామర్శిస్తారు.
హై అలర్ట్..
నడిరోడ్డుపై హత్య జరగడంతో వినుకొండలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పహారా పెంచారు. వైసీపీ నేతలు రషీద్ కుటుంబాన్ని చూసేందుకు వస్తుండటంతో వారి ఇంటి వద్ద కూడా బందోబస్తు పెంచారు పోలీసులు. ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో మరింత అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జగన్ రాక సందర్భంగా పలువురు కీలక నేతలు కూడా వినుకొండకు చేరుకుంటారని తెలుస్తోంది. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా ఆయన వినుకొండకు వస్తారు. దారి పొడవునా జగన్ వాహన శ్రేణికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పై రాళ్లదాడి జరిగింది. ఫలితాల తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకే జగన్ వినుకొండ వస్తున్నారు. దీంతో పోలీసులు హడావిడి పడుతున్నారు.