మోసం, దగా, కుట్ర.. జగన్ ట్వీట్

అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు.. లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు జగన్.

Advertisement
Update:2024-08-10 19:22 IST

ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడం పచ్చి మోసం కాదా..?

రెండున్నర నెలల్లోనే ప్రజల్ని ఇంత దగా చేస్తారా..?

రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు, కుట్రలు..

దిగజారిన పాలనను ఇకనైనా గాడిలో పెట్టండి చంద్రబాబూ..! అంటూ ఓ సుదీర్ఘ ట్వీట్ వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

ఇటీవల పదే పదే ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్న డైలాగుల్ని గుర్తు చేస్తూ జగన్ సూటిగా ఆయన్ను నిలదీశారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర బాధ్యత తనదేనని చెప్పిన బాబు, ఎన్నికల తర్వాత బాధ్యత ప్రజలదేనంటూ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే సీఎం ప్లేటు ఫిరాయించారన్నారు. ఖజానా ఖాళీ అంటూ తప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. అప్పులకు వడ్డీలుకట్టడానికే డబ్బుల్లేవంటున్న చంద్రబాబు లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు జగన్.


తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ చేయలేదు, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అడ్రస్సే లేవన్నారు జగన్. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాట కూడాచంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ఇంటికి వచ్చే రేషన్‌ నిలిచిపోయిందని, వాలంటీర్లను మోసం చేశారని, విత్తనాలకోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని తీసుకు వచ్చారని మండిపడ్డారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారని, బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ రద్దుచేశారన్నారు.

లా అండర్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పిందని, ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోందని అన్నారు జగన్. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోందని ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ లేదని, దిశయాప్‌ అటకెక్కిందని, రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ? అని ప్రశ్నించారు జగన్. సాక్షాత్తూ గవర్నర్‌తో అసెంబ్లీలో అనేక అవాస్తవాలను చెప్పించారని అన్నారు. జూన్‌ 2024నాటికి ఏపీ ఉన్న మొత్తం అప్పు అక్షరాల రూ.7,48,612కోట్లు మాత్రమేనని ఇందులో 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు అని వివరించారు. ఆర్బీఐ నివేదికలు, కాగ్‌ లెక్కల్లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు ఈ లింక్‌ https://bit.ly/4dkOKru లో ఉన్నాని, చంద్రబాబు వాటిని జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు. ఇప్పటికైనా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News