కోర్టు ఏం చెబితే అది వినండి..

ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను లాగేసుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉండదని గతంలో హెచ్చరించిన జగన్ ఇప్పుడు సంఖ్యాబలంతో సంబంధం లేదన్నట్టు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు హోం మంత్రి అనిత.

Advertisement
Update:2024-08-07 09:28 IST

భద్రతకోసం కోర్టుకెళ్లారు కాబట్టి కోర్టు ఏం చెబితే అది వినాలని వైసీపీ నేతలకు సూచించారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌కు ఇవ్వాల్సినంత భద్రత ఇచ్చామని, ఇస్తున్నామని ఆమె వివరించారు. కానీ జగన్ మాత్రం ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడుగుతున్నారని అదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు. 980 మందితో భద్రత అంటే అది ఒక గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్యకు సమానం అవుతుందని వెటకారం చేశారు. జగన్ భద్రత వ్యవహారం కోర్టులో ఉందని ముక్తాయించారు హోం మంత్రి అనిత.

ఇన్నేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి గుర్తురాని కోడికత్తి దాడి ఇప్పుడెందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు మంత్రి అనిత. కోడికత్తి కేసులో విచారణకు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరిగారని, ఇప్పుడు ఆ దాడి సాకుగా చూపిస్తూ భద్రత పెంచాలని అడుగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బురదజల్లాలనుకోవడం సరికాదన్నారు అనిత. జగన్ ఉండే తాడేపల్లి ప్యాలెస్‌కు పెద్ద ప్రహారీ, వాటిపై విద్యుత్‌ రక్షణ కంచె, బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉన్నా కూడా.. అదనంగా 980 మంది రక్షణగా ఉన్నారని చెప్పారు అనిత. ఎన్డీయే ప్రభుత్వం కక్షగట్టి భద్రత తీసేసిందనడం సరికాదన్నారు అనిత

ప్రతిపక్ష హోదా విషయంలో గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు హోం మంత్రి అనిత. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను లాగేసుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉండదని గతంలో హెచ్చరించిన జగన్ ఇప్పుడు సంఖ్యాబలంతో సంబంధం లేదన్నట్టు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారామె. ప్రతిపక్ష హోదా రాదని తెలిసే ఆయన డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు అనిత. 

Tags:    
Advertisement

Similar News