కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఇలా తయారైందా..?

అసలు 40 లక్షల రూపాయల బకాయిలు పేరుకుపోయేంతవరకు పార్టీ నేతలు ఏమిచేస్తున్నట్లు..? మొదట్లోనే ఆ బకాయిలేవో కట్టేసుంటే ఇప్పుడు ఆఫీసుకు తాళాలు వేయాల్సిన అవసరమే ఉండేదికాదు.

Advertisement
Update:2023-01-01 12:47 IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమలో తాము గొడవలుపడి పార్టీ పరువును రోడ్డునపడేస్తున్నారు. ఇక ఏపీలో అయితే అధికారులే పార్టీ పరువును రోడ్డుకీడ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు అధికారులు తాళాలు వేసేశారు. కొన్ని సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పార్టీ ఆఫీసు మున్సిపాలిటీకి రూ. 40 లక్షలు బకాయిలుపడింది. బకాయిలు చెల్లించాలంటూ అధికారులు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.

కొత్తగా అధ్యక్షుడు అయిన గిడుగు రుద్రరాజుకు విషయం చెప్పినా లైటుగా తీసుకున్నారట. దాంతో చేసేదిలేక చివరకు అధికారులు ఆఫీసుకు తాళాలు వేశారు. ఆఫీసు బకాయిలను చెల్లించలేక తాళాలు వేయించుకున్న పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని అంటే ఎవరైనా నమ్ముతారా..? రుద్రరాజు ప‌లు సంద‌ర్భాల్లో మాట్లాడుతూ వచ్చేఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని పదే పదే చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి రాదని రుద్రరాజుకూ తెలుసు, అధ్యక్షుడు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని నేతలు, జనాలకు కూడా తెలుసు.

అసలు 40 లక్షల రూపాయల బకాయిలు పేరుకుపోయేంతవరకు పార్టీ నేతలు ఏమిచేస్తున్నట్లు..? మొదట్లోనే ఆ బకాయిలేవో కట్టేసుంటే ఇప్పుడు ఆఫీసుకు తాళాలు వేయాల్సిన అవసరమే ఉండేదికాదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీరకాలుగా లబ్దిపొందిన నేతలు తర్వాత పార్టీని గాలికొదిలేశారు. రాష్ట్ర విభజనతో తెలంగాణాలో పార్టీ నాశనమైపోతే ఏపీలో ఏకంగా భూస్థాపితమైపోయింది.

గతంలో పార్టీవల్ల లాభపడిన నేతల్లో ఓ పదిమంది గట్టిగా అనుకుని అధికారులతో మాట్లాడితే బకాయిలు తీర్చటం పెద్ద విషయంకాదు. కాకపోతే పార్టీకి భవిష్యత్తు లేదన్న విషయం నేతలందరికీ బాగా అర్థ‌మైపోయింది. అందుకే బకాయిలు తీర్చే బాధ్యతలను నేతలెవరూ తీసుకోలేదు. దాని ఫలితమే ఆఫీసుకు తాళాలు పడిపోయాయి. మరి వచ్చేఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేయటం గ్యారెంటీ అంటున్న గిడుగు రుద్రరాజు ముందు రూ. 40 లక్షల బకాయిలను తీర్చి ఆఫీసు తలుపులను మళ్ళీ తెరిచేట్లు చేస్తే అదే పదివేలు.

Tags:    
Advertisement

Similar News