మచ్చుమర్రి బాధితులకు రూ.10లక్షలు పరిహారం
రూ.10లక్షల పరిహారంతోపాటు, వారు నివశిస్తున్న ఇంటికి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. బాలిక తల్లికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు.
మచ్చుమర్రిలో బాలిక అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఫలితం లేదు. ఆమెను చంపి నదిలో పడేశామని హంతకులు ఒప్పుకున్నా.. గాలింపులో మృతదేహం కూడా కనపడలేదు. ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్షం పరామర్శించింది. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడటంతో ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఈ దశలో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. ఆ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం చెక్కు అందించింది.
నాటకీయ పరిణామాలు..
బాధిత కుటుంబాన్ని కలిసేందుకు మైనార్టీ మంత్రి ఫరూఖ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వస్తున్నారని తెలియడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఓ దశలో వారిని కలిసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. స్థానికులు కూడా మంత్రులు, అధికారుల్ని ఘెరావ్ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులకు నచ్చజెప్పారు. మంత్రులు ఆ కుటుంబం వద్దకు వెళ్లి పరామర్శించారు.
పరిహారంతోపాటు..
రూ.10లక్షల పరిహారంతోపాటు, వారు నివశిస్తున్న ఇంటికి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. బాలిక తల్లికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. బాలిక సోదరిని గురుకుల పాఠశాలలో చదివించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రులు. బాలిక మృతదేహం ఆచూకీ లభ్యమయ్యే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఏపీలో జరుగుతున్న వరుస దారుణాలు రాష్ట్రంలో శాంతి భద్రతల తాజా పరిస్థితి అద్దం పడుతున్నాయని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది.