పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ.. ఎందుకంటే..?

సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేలా కేడర్ ని సమాయత్తం చేస్తారు జగన్.

Advertisement
Update:2024-08-21 10:44 IST

మాజీ సీఎం జగన్ రెండు రోజులపాటు పూర్తిగా నేతలకు సమయం కేటాయించారు. ఈ రెండు రోజుల్లో అభిమానులు, కార్యకర్తలెవరూ తాడేపల్లిలోని కార్యాలయానికి రావొద్దని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజులపాటు నేతలతోనే సమావేశాలు ఉంటాయని, జగన్ బిజీగా ఉంటారని పార్టీ తెలిపింది.

ఇటీవల విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవి విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుందని అంటున్నారు నేతలు. కష్టకాలంలో కూడా పార్టీని వీడి వెళ్లకుండా పని చేస్తే, తిరిగి అధికారం తమదేనంటున్నారు. పార్టీ నేతల్ని ఆమేరకు సమాయత్తం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు రోజులు పూర్తిగా నేతలకే ఆయన సమయం కేటాయించారు.

ఇప్పటికే పార్టీ కీలక నేతలు తాడేపల్లి చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించి.. పలు అంశాలపై నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతోపాటు, రాజకీయ హత్యలు, దాడులపై కూడా చర్చ జరిగే అవకాశముంది. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దని జగన్ భరోసా ఇస్తారు.

సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేలా కేడర్ ని సమాయత్తం చేస్తారు జగన్. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటున్నారని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై నిజా నిజాలు ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. 

Tags:    
Advertisement

Similar News