హిడెన్ కెమెరాపై ఎంక్వయిరీ.. విద్యార్థినులు శాంతించినట్టేనా..?

ఈ కేసు వ్యవహారం తేలే వరకు హాస్టల్ బిల్డింగ్ లోని ప్రతి ఫ్లోర్ కు మహిళా కానిస్టేబుళ్ల‌ను ఇన్ చార్జ్ లుగా నియమిస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

Advertisement
Update: 2024-08-31 01:35 GMT

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో హిడెన్ కెమెరాల ఘటన ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని అనలేం కానీ, ఘటన జరిగిన తర్వాత అధికారులు స్పందించిన తీరు మరీ ఘోరంగా ఉందనే ఆరోపణలు వినపడుతున్నాయి. కాలేజీ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలున్నాయని, వాటి ద్వారా తీసిన 300కి పైగా వీడియోలు బయటకెళ్లాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేయగా, పోలీసులు కనీసం ఎంక్వయిరీ చేయకుండానే అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేయడం సంచలనంగా మారింది. చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో అధికార యంత్రాంగం నష్టనివారణ చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా హుటాహుటిన కాలేజీకి వెళ్లారు. విద్యార్థినులతో నేరుగా వారు మాట్లాడారు.

కాలేజీ హాస్టల్ లో హిడెన్ కెమెరాలు లేవని నిర్థారణ అయితేనే తాము లోపలికి వెళ్తామని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దీంతో బాంబుస్క్వాడ్, ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించే డిటెక్టర్లతో హాస్టల్ అంతా పోలీసులు సోదాలు చేశారు. నాన్‌ లీనియర్‌ జంక్షన్‌ డిటెక్షన్‌ అనే విధానంలో పరిశీలిన చేపట్టారు. ఈ కేసు విచారణ ప్రత్యేక అధికారి సీఐ రమణమ్మ, ఎస్సై పూర్ణ మాధురి నేతృత్వంలో పోలీసు బృందం హాస్టల్ విద్యార్థినులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ప్రతి బాత్ రూమ్ ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఎలాంటి కెమెరాలు లేవని నిర్థారించారు. దీంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ కేసు వ్యవహారం తేలే వరకు హాస్టల్ బిల్డింగ్ లోని ప్రతి ఫ్లోర్ కు మహిళా కానిస్టేబుళ్ల‌ను ఇన్ చార్జ్ లుగా నియమిస్తున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు కాకినాడ జేఎన్‌టీయూ ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించింది. యూనివర్శిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ రవీంద్రనాథ్ సహా మరో ఇద్దరితో కూడిన కమిటీ విచారణ చేపట్టింది. వారు కాలేజీని సందర్శించి వివరాలు సేకరించారు.

సీఎం చంద్రబాబు కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రతి మూడు గంటలకోసారి తనకు అప్ డేట్ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థినులెవరూ అధైర్యపడొద్దని, వారికి అండగా ప్రభుత్వం ఉందని, తప్పుచేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సోషల్ మీడియా ద్వారా తన సందేశమిచ్చారు చంద్రబాబు. 

Tags:    
Advertisement

Similar News