టీడీపీ నేత కళా వెంకట్రావుకు అసమ్మతి సెగ.. - మండలానికో అసమ్మతి నాయకుడు
నియోజకవర్గంలో కళా వెంకట్రావుకు అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్నవారిలో కలిశెట్టి అప్పలనాయుడు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి దంపతులు, మాజీ ఎంపీపీ బాల బొమ్మన సూర్యనారాయణ, దామోదరరావు వంటి నేతలు ఉన్నారు.
కొన్నాళ్లపాటు పార్టీ బరువు బాధ్యతలు కూడా మోసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ తగులుతోంది. సిక్కోలు జిల్లాలో తన కనుసైగతో అందరినీ శాసించిన ఈ నేతకు ఇప్పుడు మండలానికో అసమ్మతి నేత తయారయ్యాడు. టీడీపీకి రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగానూ పనిచేసినా.. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన అనుభవజ్ఞుడైనా.. ఇప్పుడు ఆయన మాట లెక్కచేసేందుకు కొత్త తరం నేతలు సిద్ధంగా లేరు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే మండలానికొకరు చొప్పున కళాకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమకే సీటు కావాలని బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వీలుచిక్కినప్పుడల్లా భారీగా జనాన్ని తరలిస్తూ బల ప్రదర్శనలు చేస్తున్నారు. వారు అసమ్మతి స్వరం వినిపిస్తూనే.. సొంత బలాన్ని పెంచుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం రాజాం. అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆయన ఎచ్చెర్లకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఆయనకు మద్దతిస్తూ పోతే.. రానున్న రోజుల్లో ఆయన ఇక్కడ సెటిలైపోతారనే భయం స్థానిక నేతల్లో గుబులు రేపుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే తామూ రాజకీయంగా ఎదగాలనే భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగానే కళా వెంకట్రావుకు పొగ పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలు అంటీముట్టనట్టుగా ఉంటుండగా, మరికొంతమంది అసమ్మతి గళంతో దూరమైనట్టు సమాచారం.
నియోజకవర్గంలో కళా వెంకట్రావుకు అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్నవారిలో కలిశెట్టి అప్పలనాయుడు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి దంపతులు, మాజీ ఎంపీపీ బాల బొమ్మన సూర్యనారాయణ, దామోదరరావు వంటి నేతలు ఉన్నారు. పరిస్థితి గమనించిన కళా వెంకట్రావు వారిని కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయా నేతలు మాత్రం గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నట్టు సమాచారం. కళా వెంకట్రావు వైపే రానున్న ఎన్నికల్లో అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నప్పటికీ.. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు అయితే.. రానున్న ఎన్నికల్లో ఎచ్చెర్ల సీటు తనకే అంటూ ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం. నాలుగు మండలాల నేతల మద్దతూ తనకే ఉండేలా వారందరినీ కూడగట్టేందుకు ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన చంద్రబాబు పర్యటనలో ఈ అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఎవరికి వారు బల ప్రదర్శనలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల నుంచి రాజాం వరకు ఇదే వరుస కనిపించింది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోనని సిక్కోలు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.