జీతాల విషయంలో ఊహకు అందని జగన్ లాజిక్
ఒకవేళ నిజంగానే ఆర్థిక సమస్యలుంటే జీతాలతోపాటు సామాజిక పెన్షన్లు కూడా ఆలస్యం చేయాలి. కానీ ఆ విషయంలో మాత్రం ఎక్కడా జగన్ ఛాన్స్ తీసుకోవడంలేదు. పెన్షన్లు ఒకటోతేదీ ఇవ్వాలనేది ఆయన ఫస్ట్ ప్రయారిటీ.
ఏపీలో ప్రతి నెలా సామాజిక పెన్షన్లు ఒకటో తేదీ ఠంచనుగా అవ్వాతాతలకు అందుతున్నాయి. తెల్లవారు ఝామునే ఈ పంపిణీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి దాదాపు 90శాతం పూర్తి అంటూ సాక్షిలో వార్తకూడా వచ్చేస్తుంది. ఇదేమీ సెల్ఫ్ డబ్బా కాదు, నిజంగా నిజమే. కానీ అదే సమయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం జీతాలకోసం 10వతేదీ వరకు వేచి చూస్తుంటారు. దీనిపై అధికార పార్టీ సహా, అధికార పార్టీ మీడియా కూడా మాట్లాడటానికేమీ లేదు. అందరికీ తెలిసిన విషయమనే అయినా.. ఎవరూ దీని గురించి నోరు మెదపరు. గతంలో ఉద్యమాలంటూ రోడ్లెక్కిన ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. జీతం అకౌంట్ లో పడినప్పుడే మహాప్రసాదం అనుకుంటున్నారు, అడ్జస్ట్ మెంట్లు చేసుకుంటున్నారు. అంతమాత్రాన వారిలో అసంతృప్తి లేదు అనుకోలేం, సమయం వచ్చినప్పుడు అది బయటపడకుండా ఉంటుంది అనుకోలేం.
అవ్వాతాతల పెన్షన్ల విషయంలో ఎప్పుడూ ఒకటో తేదీ దాటనివ్వని సీఎం జగన్, ఉద్యోగుల జీతాల విషయంలో మాత్రం ఎందుకంత తాత్సారం చేస్తున్నారు..? నిధుల సమస్యే ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. సమస్యలు ఎన్ని ఉన్నా పెన్షన్ల విషయంలో రాజీపడటం లేదు అని ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకం కూడా ఆపలేదని అంటుంది. అది అభినందించదగ్గ విషయమే అయినా, ఉద్యోగుల జీతాల ఆలస్యం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఒకటోతేదీకే ఉద్యోగుల జీతాలు.. అని ప్రచారం చేశాయి ప్రతిపక్షాలు. జీతాలు సకాలంలో ఇవ్వడంలేదని అప్పటి ప్రభుత్వంపై నిందలు వేశాయి. ఆ ప్రచారం విజయవంతమైందని రిజల్ట్ చెబుతున్నాయి. మరి ఏపీలో పరిస్థితి ఏంటి..? మేం అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లతోపాటు, ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తేదీనే ఇస్తామని ప్రతిపక్షాలు హామీ ఇస్తాయనడంలో అనుమానం లేదు. ఆ హామీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.
జగన్ లాజిక్ ఏంటి..?
ఒకవేళ నిజంగానే ఆర్థిక సమస్యలుంటే జీతాలతోపాటు సామాజిక పెన్షన్లు కూడా ఆలస్యం చేయాలి. కానీ ఆ విషయంలో మాత్రం ఎక్కడా జగన్ ఛాన్స్ తీసుకోవడంలేదు. పెన్షన్లు ఒకటోతేదీ ఇవ్వాలనేది ఆయన ఫస్ట్ ప్రయారిటీ. ఈ లాజిక్ ఏంటో జగన్ కే తెలియాలి. ఇప్పటి వరకు ఓకే, ఎన్నికల ఏడాది మొదలైనా ఇంకా జీతాలు ఆలస్యమవుతున్నాయంటే ఎన్నికలనాటికి ఉద్యోగులు ఆ విషయాన్ని బలంగా మనసులో పెట్టుకుంటారు. ఆ అపాయానికి జగన్ దగ్గర ఎలాంటి ఉపాయం ఉందో చూడాలి.