టౌన్‌షిప్‌లపై సీఆర్డీఏ ఫోకస్‌

నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 40.78 ఎకరాల్లో కొత్త లేఅవుట్‌ ప్లాట్లను అమ్మకానికి సిద్ధం చేసింది సీఆర్డీఏ. చదరపుగజం రూ. 8500 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది.

Advertisement
Update:2023-07-02 13:05 IST

ప్రతి నియోజకవర్గంలో మధ్యతరగతి ఆదాయ వర్గాల (Middle Income Group) సొంతింటి కల సాకారం చేసే దిశగా టౌన్‌షిప్‌ల విస్తరణపై రాజధాని ప్రాంత ప్రాథికార అభివృద్ధి సంస్థ (CRDA) ఫోకస్‌ పెంచింది. సీఆర్డీఏ పరిధిలోని ఐదు జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో ఎంఐజీ టౌన్‌షిప్‌ లేఅవుట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల భూ సేకరణ పూర్తికాగా, మరికొన్ని నియోజకవర్గాల్లో భూ సేకరణ సమస్యల పరిష్కారంపై కసరత్తు చేస్తోంది. కొన్ని చోట్ల స్థల పరిశీలన జరుపుతోంది.

విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి పెదవుటుపల్లి, ఉంగుటూరు గ్రామాల పరిధిలో మ్యాపింగ్‌ జరుగుతోంది. గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గం చేబ్రోలు మండలం నారాకోడూరులో భూ సమీకరణకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరోచోట భూములను పరిశీలిస్తోంది. కొన్నిచోట్ల రైతులు అధిక ధర డిమాండ్‌ చేస్తుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాద‌నతో ముందుకు రావడంతో సీఆర్డీఏ పరిధిలో టౌన్‌షిప్‌ల పట్ల కొనుగోలుదార్లు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. దీంతో ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని సీఆర్డీఏ యోచిస్తోంది.

టౌన్‌షిప్‌లలో ప్లాట్ల కొనుగోలుకు ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మినహాయింపు ఇవ్వనుంది. కొనుగోలుదార్లకు అందుబాటు ధరల్లో మార్కెట్‌ ధర ప్రామాణికంగా స్థలాలను విక్రయించనుంది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌ ప్లాట్లను మూడు విడతల్లో విక్రయించింది సీఆర్డీఏ. ఈ విక్రయాలతో దాదాపు రూ. 60 కోట్ల ఆదాయం లభించింది.

నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 40.78 ఎకరాల్లో కొత్త లేఅవుట్‌ ప్లాట్లను అమ్మకానికి సిద్ధం చేసింది సీఆర్డీఏ. చదరపుగజం రూ. 8500 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా సీఆర్డీఏ ఫోకస్‌ పెట్టింది. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థతో పాటు విద్యుత్‌, త్రాగునీరు వంటి సదుపాయాల పనులు ఒకేసారి పూర్తిచేస్తోంది.

తెనాలి నియోజకవర్గం నేలపాడులో భూ సేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బొంతపాడులో భూ సేకరణకు, టౌన్‌షిప్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ రోడ్డు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మైలవరం నియోజకవర్గం కొత్తూరు తాడేపల్లి, తిరువూరు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో టౌన్‌షిప్‌ ప్రతిపాదనలపై సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. కృష్ణాజిల్లా పెనమలూరు, పామర్రు, జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు భూముల పరిశీలన జరగాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News