జగన్‌ పాలన బాగుందని బాబే ఒప్పుకున్నాడు.. - పిడుగురాళ్ల సభలో సీఎం వైఎస్‌ జగన్‌

చంద్రబాబు తన హయాంలో జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని, చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లేనని సీఎం జగన్‌ విమర్శించారు. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారన్నారు.

Advertisement
Update:2024-04-10 23:09 IST

చంద్రబాబు నాయుడు వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని అంటున్నాడని, ఈ విధంగానైనా జగన్‌ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నాడని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లూ వలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారని ఆయన తెలిపారు. ఇంతకంటే జగన్‌ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్‌ ఏం ఉంటుందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రశ్నించారు. ప్రజలు తిరగబడేసరికి చంద్రబాబు మారిపోయాడని, ఇప్పుడు వలంటీర్లను బాబు మెచ్చుకుంటున్నారని, మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

వలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జగన్‌ ఎద్దేవా చేశారు. ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న వ్యక్తి చంద్రబాబని ఆయన విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించిన చంద్రబాబు.. అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ ఆపారని ఆయన తెలిపారు. తద్వారా అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారని చెప్పారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఊసరవెల్లిలా రంగులు మార్చి ఇప్పుడు వలంటీర్లపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్‌ విమర్శించారు.

చంద్రబాబు తన హయాంలో జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని, చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లేనని సీఎం జగన్‌ విమర్శించారు. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారన్నారు. చంద్రబాబు మోసాలు అందరికీ తెలుసని, రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం బాబు మనస్తత్వమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమేనని, రానున్నవి పేదల తలరాతను మార్చే ఎన్నికలని ఆయన చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. జరుగుతున్న మంచి కొనసాగాలంటే మీ జగన్‌కు ఓటేయాలంటూ ప్రజలను కోరారు. ఎల్లో మీడియాపై కూడా ఈ సందర్భంగా జగన్‌ విమర్శలు గుప్పించారు. గాడిదను చూపించి గుర్రమని నమ్మించేందుకు పచ్చమీడియా ప్రయత్నిస్తుందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News