గేర్ మార్చిన జగన్.. ఎన్నికల ముంగిట డీఎస్సీ

ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా.. అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దాంతో జగన్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.

Advertisement
Update:2023-10-13 08:35 IST

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని వర్గాల ప్రజలని సంక్షేమ పథకాలతో సంతృప్తి పరిచిన సీఎం వైయస్ జగన్.. నిరుద్యోగుల విషయంలో మాత్రం మొదటి నుంచి శీతకన్ను వేశారన్నది నిజం. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా.. అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దాంతో జగన్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుర్రుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ముంగిట వారిని సంతృప్తి పరిచే దిశగా జగన్ అడుగులు వేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంకేతాలిచ్చారు.

త్వరలోనే టెట్.. ఆ వెంటనే డీఎస్సీ

ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. ఆ డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహిస్తామని.. అలానే యూనివర్సిటీలు, ట్రిఫుల్ ఐటీల్లో కలిపి సుమారు 3,238 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. బహుశా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో డీఎస్సీ గురించి చర్చ జరిగినట్లు ఉంటుంది. కానీ మంత్రి కాస్త ఆలస్యంగా మీడియాకి వెల్లడించారు. అయితే.. తేదీలు చెప్పకపోవడంతో అధికార ప్రకటన కోసం నిరుద్యోగులు వేచి చూడాల్సిందే.

2018 నుంచి మెగా డీఎస్సీ కోసం వెయిటింగ్..!

సీఎం వైయస్ జగన్ తాను అధికారంలో వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తానంటూ అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చి 52 నెలలైనా ఇప్పటి వరకూ డీఎస్సీ ఊసే లేదు. 2018లో చివరిగా ఏపీలో డీఎస్సీ పడింది. ఆ తర్వాత నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో చాలా చోట్ల పోస్టులను మిగులుగా తేల్చి సర్దుబాటు చేశారు. కానీ.. ప్రభుత్వ పాఠశాలల్లో 50,667 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభలో ఒక ప్రశ్నకి కేంద్ర మంత్రి గత ఏడాది చివర్లో సమాధానమిచ్చారు.

జగన్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

దసరా తర్వాత విశాఖపట్నం నుంచి పాలన ఉండబోతోందని సీఎం వైయస్ జగన్ ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. దాంతో అక్కడికి వెళ్లిన వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత డీఎస్సీ వేసి ఎన్నికల సమయానికి నిరుద్యోగులను సంతృప్తి పరచాలని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యలో యూనివర్సీటీలు, ట్రిఫుల్ ఐటీల్లోనూ ఉద్యోగాల భర్తీ చేయబోతున్నారు. దాంతో నిరుద్యోగులే లక్ష్యంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News