మేనిఫెస్టోపై హింట్ ఇచ్చిన సీఎం జగన్..
నిన్న నాయుడుపేట సభలో సీఎం జగన్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు అని అన్నారు.
వైసీపీ అభ్యర్థుల తుది జాబితాతోపాటే మేనిఫెస్టో కూడా విడుదలవుతుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. పార్టీలోని కీలక నేతలు కూడా అదిగో మేనిఫెస్టో, ఇవిగో కొత్త పథకాలన్నారు, టీడీపీ దిమ్మతిరిగిపోవడం ఖాయమన్నారు. కానీ వైసీపీ మేనిఫెస్టో మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఆ దిశగా జరుగుతున్న కసరత్తులపై కూడా ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఇంతకీ 2024 ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది..? నవరత్నాలను మించేలా జగన్ ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు.
2019 ఎన్నికలకు సంబంధించి తన పాదయాత్ర పూర్తయిన తర్వాత జగన్ నవరత్నాలను ప్రకటించారు. ఇప్పుడు కూడా బస్సుయాత్ర పూర్తయిన తర్వాత, ప్రజలనుంచి తీసుకున్న వివరాలు, సలహాలు, సూచనల ప్రకారం మేనిఫెస్టో రెడీ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి తన యాత్రలోనే హింట్లిస్తున్నారు సీఎం జగన్.
ఆ ఫైల్ పైనే తొలి సంతకం..
2024లో అధికారంలోకి వచ్చాక తన తొలి సంతకం దేనిపైనో చెప్పేశారు సీఎం జగన్. వాలంటీర్లందర్నీ తిరిగి విధుల్లో తీసుకునే ఫైల్ పై తొలి సంతకం పెడతానన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్న వారందరికీ తాను అండగా ఉంటానన్నారు. ఈసారి వాలంటీర్ల వేతనం పెరుగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. సో.. వాలంటీర్లకు సంబంధించిన కీలక అంశం మేనిఫెస్టోలో ఉంటుందనమాట. ఇక ఆటో డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లతో సమావేశం సందర్భంలో.. వాహన మిత్ర పథకాన్ని టిప్పర్, లారీ డ్రైవర్లకు కూడా వర్తింపజేస్తామంటూ కీలక హామీ ఇచ్చారు జగన్. సో.. ఇది కూడా మేనిఫెస్టోలో ఉండబోయే మరో ముఖ్యమైన పాయింట్.
నాయుడుపేట సభలో కీలక వ్యాఖ్యలు..
నిన్న నాయుడుపేట సభలో సీఎం జగన్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు అని అన్నారు. జగన్ చేయలేని ఏ స్కీమైనా చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు అబద్ధాల కిచిడీ మేనిఫెస్టోతో తాను పోటీ పడాలని అనుకోవడం లేదన్నారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నోటికి ఏదొస్తే అది చెబుతారని, కానీ తాను నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు విలువ ఇస్తానన్నారు జగన్.