తీర్థయాత్రలకు చంద్రబాబు..

డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు బెజవాడ కనక దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్తారు.

Advertisement
Update:2023-11-27 17:49 IST

టీడీపీ అధినేత చంద్రబాబు తీర్థయాత్రలకు సిద్ధమయ్యారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం తిరుమల యాత్రతో ఆయన పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమవుతుంది. తిరుమల తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దేవస్థానాలకు కూడా ఆయన కుటుంబ సమేతంగా హాజరవుతారని తెలుస్తోంది. తిరుమలతో చంద్రబాబు యాత్ర మొదలవుతుంది.

వాస్తవానికి చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన రోజే తిరుమల యాత్రకు వెళ్తారని అనుకున్నారు. టీడీపీ నేతలు కూడా ఆయన తిరుమల యాత్ర గురించి ప్రకటనలు చేశారు. కానీ అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా రావడంతో చంద్రబాబు తీర్థయాత్రలు మొదలు పెడుతున్నారు. పొలిటికల్ యాత్రలు ప్రారంభించే ముందుగా ఆయన అందరు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారని చెబుతున్నారు. ఈనెల 30 సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు బెజవాడ కనక దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో చంద్రబాబు మళ్లీ పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని టీడీపీ నేతలు తెలిపారు.

ఢిల్లీకి చంద్రబాబు..

కాసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. న్యాయవాది సిద్దార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌ కు హాజరయ్యేందుకు సతీమణి భువనేశ్వరితో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. రేపు సాయంత్రం తిరిగి ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఈనెల 30న తిరుమలకు వెళ్తారు. 


Tags:    
Advertisement

Similar News