బండారుపై బాబు సీరియస్.. బస్సులోనే బండబూతులు
బుజ్జగిస్తారనుకుంటే, ఆయన్ని బాధపెట్టే పని చేశారు చంద్రబాబు. దీంతో తీవ్ర అవమాన భారంతో బండారు సత్యనారాయణ వెళ్లిపోయారు. చంద్రబాబుకి నమస్కారం పెట్టి బస్సు దిగారు.
ఆయనో మాజీ మంత్రి, బీసీ లీడర్, కనీసం ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా బస్సులో చెడామడా తిట్టేశారు చంద్రబాబు. లోపల ఉన్నవారికి అసలు విషయం తెలుసు, బయట ఉన్న వారికి చంద్రబాబు హావభావాలు చూస్తే ఆ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన చేసిన తప్పల్లా ఒకటే. పెందుర్తి సీటుపై ఆశ పెట్టుకోవడమే. పెందుర్తి సీటు ఆశించి భంగపడిన బండారు సత్యనారాయణ, కనీసం చంద్రబాబు దగ్గరయినా ఊరట దొరుకుతుందేమో అనుకున్నారు. కానీ బస్సులో ఆయనపై అంతెత్తున ఎగిరిపడ్డారు చంద్రబాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశాఖ జిల్లా సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఆమధ్య మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు. టీడీపీలో ఆయనకు పెందుర్తి సీటు ఖాయమనే అనుకున్నారంతా. కానీ చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటుని జనసేనకు కేటాయించారు. పంచకర్ల రమేష్ అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆ సీటు విషయంలో చంద్రబాబుని ఎలాగైనా ఒప్పించాలని బండారు ప్రయత్నిస్తున్నారు. ఓ దశలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ బండారు మాత్రం చంద్రబాబుపై నమ్మకం పెట్టుకున్నారు. ఇటీవల బాబు విశాఖకు రాగా ఆయనతో భేటీ అయ్యారు.
విశాఖ పర్యటనలో నేతలతో పాటు చంద్రబాబుతో సమావేశం అయిన బండారు సత్యనారాయణ బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ టీడీపీ బలంగా ఉందని, ఆ సీటు జనసేనకు ఇస్తే ఓడిపోతుందని అన్నారు. అప్పటికి సైలెంట్ గానే ఉన్న చంద్రబాబు, ఆ తర్వాత ఆయన్ను బస్సులోకి పిలిపించారు. చెడామడా తిట్టారని సమాచారం. దీంతో బండారు అవాక్కయ్యారు. బుజ్జగిస్తారనుకుంటే, ఆయన్ని బాధపెట్టే పని చేశారు చంద్రబాబు. దీంతో తీవ్ర అవమాన భారంతో ఆయన వెళ్లిపోయారు. చంద్రబాబుకి నమస్కారం పెట్టి బస్సు దిగారు. బస్సులో జరిగిన ఎపిసోడ్ పై బండారు ఇంకా మీడియా ముందుకు రాలేదు.