వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పు.. టీడీపీకి ఉత్సాహాన్నిచ్చిందా..?
వైసీపీ నావకు చిల్లు పడిందని, బయటపడే పరిస్థితి లేదని, ఆ పార్టీ నేతలు దూకి పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇప్పటికే ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చేశారని కౌంటర్ ఇచ్చారు.
నియోజకవర్గాల ఇన్చార్జ్ లను మార్చేస్తున్నారు, వైసీపీ పనైపోయింది, ఓడిపోతామనే భయం వారిలో మొదలైందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడలేని ఉత్సాహంతో స్టేట్ మెంట్లిస్తున్నారు. 11 నియోజకవర్గాల్లోనే కాదు 151 చోట్ల ఇన్ చార్జ్ లను మార్చినా వైసీపీ ఈసారి గెలవలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని జోస్యం చెప్పారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని ఈరోజు అధికారికంగా ఆయన టీడీపీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మునిగిపోయే నావ..
వైసీపీ నావకు చిల్లు పడిందని, బయటపడే పరిస్థితి లేదని, ఆ పార్టీ నేతలు దూకి పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చేశారని కౌంటర్ ఇచ్చారు. జనవరి నుంచి సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుందని, ఫ్యాన్ తిరగడం ఆగిపోతుందని అన్నారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులంటూ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఒక అపరిచితుడని, తల్లికి, చెల్లికి కూడా ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వరని.. ఇక ఎమ్మెల్యేలకు ఎందుకిస్తారని ప్రశ్నించారు.
మెడలు వంచలేదు, దించారు..
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్.. కేంద్రం మెడలు వంచలేదు కానీ.. కేంద్రం వద్ద మెడలు దించారని అన్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే వాళ్లమని, పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని చెప్పారాయన. దేశంలోనే అత్యధికంగా ఏపీలో 24శాతం నిరుద్యోగం ఉందని, ఉద్యోగాల భర్తీని జగన్ పూర్తిగా పక్కనపెట్టేశారని విమర్శించారు. 3నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో ఎవరికీ తెలియదన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు చంద్రబాబు.