చంద్రబాబు నోట 'సంక్షేమం' మాట..

ఆదోనిలో నిర్వహించిన ఓ రోడ్ షో కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని హామీ ఇవ్వడం గమనార్హం. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా అచ్చం ఇలాంటి హామీయే ఇచ్చారు.

Advertisement
Update:2022-11-17 16:38 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హైటెక్ హంగులు.. ఇక టీడీపీ శిబిరం కూడా ఇటువంటి ప్రచారమే చేస్తూ ఉంటుంది. తమ నేత వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. తెలుగు ప్రజలకు టెక్నాలజీ పరిచయం అయ్యిందని టీడీపీ వాళ్లు తెగ ప్రచారం చేస్తుంటారు. తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనూ ఇదే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి ముద్ర వల్లే చంద్రబాబు నాయుడు 2004 (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని మూటగట్టుకున్నారు. వ్యవసాయం దండగ అని ప్రకటించడంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పరిచయం చేయడం వంటి నిర్ణయాలతో చంద్రబాబు దెబ్బతిన్నారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి.. సంక్షేమాన్ని నమ్ముకున్నారు. దీంతో ప్రజల్లో మంచి పేరు సొంతం చేసుకున్నారు. విషయం అర్థం చేసుకున్న చంద్రబాబు .. తాను మారానని.. అధికారంలోకి వస్తే తాను కూడా సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేస్తానని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 2009లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) ఆయన మాటలు జనం నమ్మలేదు. కానీ 2014 లో (విభజిత ఏపీలో) రుణమాఫీ వంటి కీలక హామీలు చేయడంతో ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు పాత పద్ధతినే అవలంభించారు. అమరావతి పేరిట గ్రాఫిక్స్ మాయాజాలం చేస్తూ పోయారు. సంక్షేమ పథకాలపై పెద్దగా ఫోకస్ పెట్ట‌లేదు. గతంలో ఉన్న కొన్ని పథకాలను తప్పనిసరై కొనసాగించారు.

ఇదిలా ఉంటే జగన్ మాత్రం తండ్రిలాగే మళ్లీ సంక్షేమాన్నే నమ్ముకున్నారు. నవరత్నాలను జనంలోకి బలంగా తీసుకెళ్లారు. కాగా, జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడంపై గత కొన్ని రోజులుగా టీడీపీ శిబిరం తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోంది. రాష్ట్రంలో శ్రీలంక లాంటి పరిస్థితి రాబోతున్నదని.. రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేస్తున్నారన్నది వారి ఆరోపణ.

అయితే ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఓ రోడ్ షో కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని హామీ ఇవ్వడం గమనార్హం. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా అచ్చం ఇలాంటి హామీయే ఇచ్చారు. దీన్ని బట్టి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతలా చొచ్చుకుపోయాయే అర్థం చేసుకోవచ్చు. ఈ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నప్పుడు ప్రజలు తమను పట్టించుకోరని.. టీడీపీ, జనసేన గట్టిగా భావిస్తున్నట్టున్నాయి. అందుకే సంక్షేమ జపం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ప్రకటనే చేశారు.

ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశానని చంద్రబాబు చెప్పుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే కచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నారు. తద్వారా ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని చంద్రబాబు ఒప్పుకున్నట్టయ్యింది.

Tags:    
Advertisement

Similar News