త్యాగమూర్తులకు జాతీయ పదవులు.. చంద్రబాబు ఉదారత
జాతీయ పోస్ట్ లు తీసుకున్న నేతల త్యాగాల్ని మెచ్చుకోవడంతోపాటు, వారిని అలా మభ్యపెట్టిన చంద్రబాబు తెలివితేటల్ని కూడా కచ్చితంగా ప్రశంసించాల్సిందే.
హామీల అమలు విషయంలో చంద్రబాబుకి మోసగాడు అనే పేరుంది. ప్రజల్నే కాదు సొంత పార్టీ నేతలను మోసం చేయడంలో కూడా దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారాయన. కూటమి కుంపటి వల్ల, ఇతరత్రా కారణాల వల్ల సీట్లు త్యాగం చేసిన వారికి అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు బాబు. జాతీయ స్థాయి పదవులంటూ ఊరిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఇలాంటి పదవులిచ్చి సర్దిచెప్పారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనే దిక్కులేని టీడీపీ.. జాతీయ పార్టీ అని చెబితే ఎవరైనా నమ్ముతారా..? అలాంటి పార్టీలో జాతీయ పదవులంటే అంతకంటే కామెడీ ఇంకేమయినా ఉందా..? కానీ టికెట్లు రాని నాయకులకు జాతీయ స్థాయి పదవులంటూ చంద్రబాబు మోసం చేయగలిగారంటే అది ఆయన గొప్పతనమే మరి.
నెల్లూరు జిల్లా ఉదయగిరి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు చంద్రబాబు. ఆ పదవితో ఆయనకు ఒరిగేదేమీ ఉండదు, కానీ చంద్రబాబు మార్కు మ్యాజిక్ మాత్రం అక్కడ పనిచేసింది. ఉదయగిరి టీడీపీ టికెట్ సాధించిన ఎన్నారై కాకర్ల సురేష్ తో కలసి పనిచేసేందుకు బొల్లినేని సిద్ధమయ్యారు. ఇటీవల టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వడంతోపాటు ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ కూడా ఖరారు చేశారు చంద్రబాబు. అప్పటికే కోవూరులో టీడీపీ అభ్యర్థిగా ఓ దఫా ప్రచారం పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కొడుకు దినేష్ రెడ్డికి ఈ వ్యవహారంతో షాక్ తగిలింది. పోలంరెడ్డి ఫ్యామిలీని బుజ్జగించేందుకు దినేష్ రెడ్డికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అనే పోస్ట్ ఇచ్చారు. ఇలా జాతీయ పోస్ట్ లు తీసుకున్న నేతల త్యాగాల్ని మెచ్చుకోవడంతోపాటు, వారిని అలా మభ్యపెట్టిన చంద్రబాబు తెలివితేటల్ని కూడా కచ్చితంగా ప్రశంసించాల్సిందే.
వర్మకు ఎమ్మెల్సీ..
ఇక పిఠాపురం సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మకు ఫస్ట్ లిస్ట్ లో ఎమ్మెల్సీ సీటు హామీ తెలిసిందే. ఏపీలో కూటమి గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఖాయం అంటూ వర్మను సైలెంట్ చేశారు బాబు, పవన్ కి భారం దించారు. కేవలం ప్రజలకే కాదు, పార్టీ నాయకులకు కూడా ఇలా అబద్ధపు హామీలతో టోపీ పెట్టడంలో చంద్రబాబు దిట్ట. హామీల సంగతి పక్కనపెడితే.. టీడీపీలో జాతీయ స్థాయి పదవుల పందేరం ఈసారి మరింత కామెడీని పంచుతోంది.