కూటమిలో కుంపటి.. అసంతృప్తిలో ఏపీ బీజేపీ

ఉన్నవన్నీ చంద్రబాబు కోటాలో భర్తీ అయితే.. ఏపీలో బీజేపీ జెండా మోసి, బీజేపీని బలోపేతం చేసిన నాయకులకు దక్కేదేంటి అనేది అసలు నేతల ఆవేదన.

Advertisement
Update:2024-03-20 09:44 IST

కూటమి కుదిరినా ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల పంచాయితీ తేలలేదు. టీడీపీ, బీజేపీకి ఎన్నిసీట్లు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు కానీ, ఏయే సీట్లు అనే దగ్గర బ్రేక్ పడింది. ఓడిపోయే సీట్లన్నీ బీజేపీకి అంటగట్టేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలు 6 లోక్ సభ స్థానాలు బీజేపీకి ఇవ్వాల్సి ఉండగా.. అందులో దాదాపు 10మంది చంద్రబాబు నమ్మినబంట్లు పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో బీజేపీని నమ్ముకుని ఉన్నవారు రగిలిపోతున్నారు. చంద్రబాబు బ్యాచ్ కి బీజేపీలో టికెట్లు ఇవ్వకూడదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ సీట్లపై ఢిల్లీలో పంచాయితీ జరుగుతోంది. ఒకరకంగా చంద్రబాబే ఏపీ బీజేపీలో చిచ్చుపెట్టినట్టయింది.

అనకాపల్లి, అరకు, ఏలూరు లేదా నరసాపురం, రాజంపేట, హిందూపూర్, తిరుపతి పార్లమెంట్ స్ధానాలు బీజేపీకి కేటాయించినట్టుగా ఎల్లో మీడియాతో లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు. ఇక్కడ కూడా నాలుగు స్థానాలు చంద్రబాబు బ్యాచ్ కే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తుండగా, ఏలూరు స్ధానం కోసం సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నారు. నర్సాపురంకోసం రఘురామకృష్ణంరాజు కర్చీఫ్ రెడీ చేసుకున్నారు. ఇక పురందరేశ్వరికి కూడా మరో ఎంపీ సీటు కేటాయించాలి. ఇలా ఉన్నవన్నీ చంద్రబాబు కోటాలో భర్తీ అయితే.. ఏపీలో బీజేపీ జెండా మోసి, బీజేపీని బలోపేతం చేసిన నాయకులకు దక్కేదేంటి అనేది అసలు నేతల ఆవేదన.

బీజేపీకి కేటాయించే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ నార్త్, కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలు బీజేపీకి ఇస్తున్నట్టుగా ఎల్లోమీడియా ద్వారా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు చంద్రబాబు. వాస్తవానికి బీజేపీ కోరిన చోడవరం, రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి వంటి స్థానాల్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. గతంలో టీడీపీకి ఏమాత్రం అవకాశం లేని స్థానాలను మాత్రం ఉదారంగా బీజేపీకి కేటాయిస్తున్నారు చంద్రబాబు.

ఇక బీజేపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేలా, ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య చెడగొట్టేలా చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. జనసేన ఆశించిన సీట్లను కొన్నిటిని బీజేపీకి కేటాయిస్తున్నారు. అక్కడ ఆ రెండు పార్టీలు గొడవపడుతున్నాయి. మొత్తమ్మీద బీజేపీని ఈసారి దారుణంగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఓడిపోయే సీట్లు ఇవ్వడం, గెలవడానికి అవకాశమున్న చోట్ల తన మనుషుల్ని పెట్టడం.. ఇదీ చంద్రబాబు గేమ్ ప్లాన్. ప్రస్తుతం దీనిపైనే ఢిల్లీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబుపై ఏపీ బీజేపీలోని ఓ వర్గం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News