నేను మారానంటున్న చంద్రబాబు..

ఇంతకీ చంద్రబాబు ‘నేను మారాను..’ అంటూ చేసిన వ్యాఖ్యలు నిజం కావడం కోసం ఏం చేయబోతున్నారనే ప్రశ్న రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement
Update:2024-06-07 07:30 IST

అవును.. చంద్రబాబు తాను మారానంటున్నారు.. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని చెబుతున్నారు.. ఇప్పటివరకు తనపై చంద్రబాబు మారరు అనే అపవాదు ఉందని, ఇకపై అలా ఉండదని అంటున్నారు.. అది కూడా ప్రత్యక్షంగా మీరే చూస్తారని చెబుతున్నారు.. ఇంతకీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది ఎక్కడంటే.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో గురువారం ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రి వర్గ కూర్పు, అందులో టీడీపీకి ఉన్న ప్రాధాన్యత తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. ఎంపీలందరూ తరచూ వచ్చి తనను కలవాలని చెప్పారు. తాను బిజీగా ఉన్నా కూడా మాట్లాడతానని స్పష్టం చేశారు. ఈనెల 12న తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

ఇంతకీ చంద్రబాబు ‘నేను మారాను..’ అంటూ చేసిన వ్యాఖ్యలు నిజం కావడం కోసం ఏం చేయబోతున్నారనే ప్రశ్న రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన ఏ హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ఎగ్గొట్టిన చెడ్డ పేరును ఆయన ఇప్పటికే సొంతం చేసుకున్నారు. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అయితే.. అనేక రకాల కొర్రీలు పెట్టి అరకొరగానే అమలు చేశారు. దీంతో అనేకమంది రుణమాఫీ హామీని నమ్మినవారు నిలువునా మోసపోయారనే చెప్పాలి. ఇక ఇలాంటి ఉదాహరణలు ఆయన రాజకీయ జీవితంలో అనేకం ఉన్నాయి. అందుకే చంద్రబాబుపై ఆయన మారరు అనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయింది. రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యే వారందరికీ కూడా ఈ విషయం తెలుసు.

మరి ఇప్పుడు మాత్రం ఆయన తాను మారానంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. తాను మారాను అనిపించుకోవడం కోసం చంద్రబాబు ప్రజల సంక్షేమం పేరుతో ప్రకటించిన పథకాలను ఎలాంటి కొర్రీలూ లేకుండా అమలు చేస్తారని భావించవచ్చా అనేది రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమయ్యే ప్రశ్న. ఇచ్చిన హామీలను కొర్రీలు పెట్టకుండా కచ్చితంగా నెరవేర్చడం ద్వారా మాత్రమే చంద్రబాబు మారారనేది నమ్మేందుకు అవకాశముంటుంది. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News