చంద్రబాబు ఫుల్లు హ్యాపీనా?

రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు దాదాపు చివరవి. ఈ సమయంలో సీఎం అభ్యర్థిగా పవన్ గనుక పట్టుబడితే అది పొత్తులపైన తీవ్ర ప్రభావం పడుండేదే అనటంలో సందేహంలేదు. అప్పుడు పొత్తు కుదరకపోతే మొదటి నష్టపోయేది చంద్రబాబే.

Advertisement
Update: 2023-05-13 05:22 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటనతో ఒకవైపు చేగొండి హరిరామజోగయ్య, కాపుల్లోని కొందరు బాధపడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. జోగయ్య మొదటి నుండి చెబుతున్నది ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తుంటేనే వైసీపీని ఓడించటం సాధ్యమవుతుందని. అయితే రెండు పార్టీల మధ్య పొత్తుండాలంటే పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే కాపులు ఓట్లేస్తారని లేకపోతే వేయరని డైరెక్టుగానే ఇటు పవన్ అటు చంద్రబాబును హెచ్చరిస్తున్నారు.

కాపుల్లోని ఒక సెక్షన్ కూడా పవన్ సీఎం అభ్యర్థి అయితేనే బాగుంటుందని అక్కడక్కడ డిమాండ్లు వినిపిస్తున్నారు. దాంతో టీడీపీ-జనసేన పొత్తుపై కొందరు తమ్ముళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించేట్లయితే అసలు పొత్తే వద్దని చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన, అధికారంలో భాగస్వామ్యం లాంటి ప్రకటనలు తమ్ముళ్ళతో పాటు చంద్రబాబుకు కూడా ఏమాత్రం రుచించటంలేదు.

ఈ నేపథ్యంలోనే పవనే తాను ముఖ్యమంత్రి రేసులో లేనని ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి అడగాలంటే అందుకు ఒక స్థాయి ఉండాలని కూడా చెప్పారు. కాబట్టి టీడీపీతో పొత్తుకు తాను భేషరతుగా అంగీకరిస్తానని పవన్ చెప్పేశారు. తాజా ప్రకటనతో గౌరవం, మర్యాద అన్నదంతా అబద్ధాలే అని తేలిపోయింది. సో పవన్ తాజా ప్రకటనతో చంద్రబాబు మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. శుక్రవారం పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత పార్టీలకు వచ్చిన అసెంబ్లీ సంఖ్యాబలం ఆధారంగానే సీఎం అభ్యర్థి ఎవరేది తేలుతుందని చెప్పారు. అయితే ఇది కేవలం కంటితుడుపు మాటలని అర్థ‌మైపోతోంది. అలా కాకుండా ముఖ్యమంత్రి పదవికి పవన్ పట్టుబడితే చంద్రబాబు ఇబ్బందే పడేవారే.

రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు దాదాపు చివరవి. ఈ సమయంలో సీఎం అభ్యర్థిగా పవన్ గనుక పట్టుబడితే అది పొత్తులపైన తీవ్ర ప్రభావం పడుండేదే అనటంలో సందేహంలేదు. అప్పుడు పొత్తు కుదరకపోతే మొదటి నష్టపోయేది చంద్రబాబే. ఎవరికి వాళ్ళుగా పోటీచేస్తే మళ్ళీ వైసీపీ గెలుపున‌కే ఎక్కువ అవకాశాలుండేవి. అలాంటి సమస్యలేవీ ఇప్పుడు లేవు. పవన్ ప్రకటనతో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేలిపోయింది. చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే. అందుకనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉండుంటారు.

Tags:    
Advertisement

Similar News