బీజేపీ బలపడినట్లే..!
తనకు ముందు బాధ్యతలు చూసినవాళ్ళు బలోపేతం చేయలేదు కాబట్టే ఇప్పుడు బాధ్యతంతా పురందేశ్వరి మీదే పడింది. అయితే ఐదారు నెలల్లోనే పార్టీని బలోపేతం చేయటం ఆమెకు సాధ్యమేనా? అవకాశాలు ఏ కోణంలో కూడా కనబడటంలేదు.
బీజేపీ కీలక నేతల సమావేశంలో కొత్త అధ్యక్షురాలైన దగ్గబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయటంపైనే తాను దృష్టి పెట్టబోతున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ఇక ఉన్న సమయం ఐదారు నెలలు మాత్రమే కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యత ఉందన్నారు. నిజమే ఎవరైనా పార్టీని బలోపేతం చేయాలనే అనుకుంటారు. కానీ పురందేశ్వరికి ముందు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళెవరూ ఈపని చేయలేదు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కంభంపాటి హరిబాబు ఇలా ఎవరిని తీసుకున్నా సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై పెద్దగా ప్రయత్నించలేదు.
తనకు ముందు బాధ్యతలు చూసినవాళ్ళు బలోపేతం చేయలేదు కాబట్టే ఇప్పుడు బాధ్యతంతా పురందేశ్వరి మీదే పడింది. అయితే ఐదారు నెలల్లోనే పార్టీని బలోపేతం చేయటం ఆమెకు సాధ్యమేనా? అవకాశాలు ఏ కోణంలో కూడా కనబడటంలేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీజేపీకి మద్దతుగా నిలిచే సామాజికవర్గం ఒక్కటంటే ఒక్కటికూడా లేదు. కమ్మ సామాజికవర్గం టీడీపీతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్తియన్ మైనారిటీలు, బీసీల్లో మేజర్ సెక్షన్, రెడ్లలో కొంత వైసీపీకి మద్దతుగా ఉన్నాయి. కాపు నేతలు ఎవరిష్టం వచ్చిన పార్టీల్లో వాళ్ళున్నారు.
పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గమే కాబట్టి కాపుల్లోని కొంత యువత జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక అగ్రవర్ణాల్లోని మిగిలిన సామాజికవర్గాలు ఎవరిష్ట ప్రకారం వాళ్ళుంటారు. కాబట్టి ఏ సామాజికవర్గం మద్దతు లేకుండా బీజేపీ ఎలా బలోపేతమవుతుంది? ఇక్కడ విషయం ఏమిటంటే ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఒక కమిటీ ఉంది.
ఆ కమిటీకి కన్వీనర్ పురందేశ్వరే. మరి తాను కన్వీనరుగా ఉండి ఎంతమంది ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చారో చెప్పగలరా? టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపీలకు పురందేశ్వరికి సంబంధంలేదు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలు కూడా తమకున్న మార్గాల్లో కమలం పార్టీలో చేరారే కానీ పురందేశ్వరి ద్వారా చేరినట్లు ఎక్కడా ప్రచారం జరగలేదు. మరి ఇక బీజేపీని ఐదారుమాసాల్లో పురందేశ్వరి ఏ విధంగా బలోపేతం చేయగలరు?