విశాఖపై మనసు పారేసుకున్న జీవీఎల్ నరసింహారావు
రాజ్యసభ పదవీకాలం ముగియనుండటం, మళ్లీ రెన్యువల్ చేసే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తగా విశాఖని తన రాజకీయ కార్యకలాపాలకి వేదికగా చేసుకున్నారు.
అందమైన విశాఖని ఇష్టపడని వారెవరుంటారు. అపరిమిత వనరులున్న విశాఖపట్టణంపై అందరి దృష్టి ఉంటుంది. ఇప్పటివరకూ కొన్ని వందలమంది చిరువ్యాపారులుగా, చిరుద్యోగులుగా వచ్చి ఇప్పుడు విశాఖ అపరకుబేరులయ్యారు. అందుకే విశాఖని వలస నేతలు ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఇక్కడే సెటిలైపోయారు. వారిప్పుడు విశాఖలో లోకల్స్. పార్టీ ఏదైనా, ప్రాంతం ఏదైనా ఆయా నేతలు చివరికి చేరే నగరం విశాఖ. ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేసే ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా నాన్ లోకల్ వాళ్లే ఉంటారు. ఇంతమంది ప్రాంతేతరులని ఆదరించి అన్నీ ఇస్తున్న వైజాగ్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మనసు పారేసుకున్నారు.
గుంటుపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అలియాస్ జీవీఎల్ నరసింహారావు పుట్టింది ప్రకాశం జిల్లా పరిధి బల్లికురవ. పెరిగింది గుంటూరు జిల్లా నరసరావుపేట. చదివింది బాపట్ల. ఉన్నతవిద్య పూర్తి చేసింది గుజరాత్. బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకి పంపింది. నేటివరకూ జీవీఎల్ నరసింహారావుకి విశాఖతో ఎటువంటి సంబంధబాంధవ్యాలూ లేవు. కానీ, ఆయన చాలామంది వలస నేతల్లాగే విశాఖపై మనసుపడి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
రాజ్యసభ పదవీకాలం ముగియనుండటం, మళ్లీ రెన్యువల్ చేసే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తగా విశాఖని తన రాజకీయ కార్యకలాపాలకి వేదికగా చేసుకున్నారు. అయితే జీవీఎల్‌కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విశాఖ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని అనువదిస్తూ తనకి నచ్చినట్టు మార్చేయడాన్ని షా కనిపెట్టేసి వేదికపైనే మందలించారు. దీంతో కాస్తా కంగారుపడిన జీవీఎల్ తమాయించుకుని మరీ నిలబడ్డారు. తాను ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి కూడా అడుగుపెట్టని జీవీఎల్ విశాఖలో ఏకంగా క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
విశాఖలో స్థానికులైన బీసీలని చేరదీస్తూ, వారి సమస్యలు పరిష్కరిస్తానని తన వెంట తిప్పుకుంటున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా జీవీఎల్ టీమ్ పేరుతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నింటి ఖర్చులూ ఆయనే పెట్టుకున్నారని సమాచారం. విశాఖపై ఇంతగా ప్రేమ పెంచుకోవడానికి బలమైన కారణాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సంపాదించినదంతా విశాఖలో వివిధ వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆస్తులు కూడా భారీగానే కూడబెట్టారని, వాటిని రక్షించుకోవాలంటే స్థానికంగా పదవి ఉంటేనే సాధ్యమని మకాం విశాఖలో పెట్టారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉత్తరాది వారు ఎక్కువగా ఉండడం బీజేపీని ఆదరిస్తారనే మరో నమ్మకమూ జీవీఎల్ కి బలంగా ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.