రివర్స్ అటాక్.. ప్రియుడిపై ప్రేయసి తల్లి దాడి

ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. ఫోన్ కాల్స్, మెసేజ్ లు, వాట్సప్ చాటింగ్, వీడియో కాల్స్, సెల్ఫీలు.. ఇలా సరదాగా సాగిపోయింది. కానీ ఉన్నట్టుండి ఆ అమ్మాయి 'వెల్డర్' లవర్ ని దూరం పెట్టింది. ప్రేమా గీమా జాన్తానై అని చెప్పింది.

Advertisement
Update:2023-09-05 12:46 IST

ప్రియురాలిపై దాడి, ప్రియురాలి కుటుంబ సభ్యులపై దాడి, ప్రియురాలి స్నేహితులపై దాడి.. ఇలా లవ్ స్టోరీల్లో జరిగే దాడి ఘటనల్లో ఎక్కువగా ప్రియురాలు, వారి కుటుంబ సభ్యులే బాధితులుగా ఉంటారు. అప్పుడప్పుడూ ప్రియుడు కూడా ప్రేమకు బలవుతుంటాడు. అలాంటి ఓ విచిత్ర ఘటన ఎన్టీఆర్ జిల్లా కానూరులో జరిగింది. ప్రియుడిపై ప్రియురాలి తల్లి కత్తితో దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.

అసలేం జరిగింది..?

కానూరుకి చెందిన నాగరాజు అనే యువకుడు ఆటోనగర్ లో లారీ బాడీ బిల్డింగ్ వర్క్ షాప్ లో వెల్డర్ గా పనిచేసేవాడు. ప్రేమిస్తే సినిమాలో లాగా మన హీరో ఓ 'లా' స్టూడెంట్ తో ప్రేమలో పడ్డాడు. ఆరేళ్లుగా ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. ఫోన్ కాల్స్, మెసేజ్ లు, వాట్సప్ చాటింగ్, వీడియో కాల్స్, సెల్ఫీలు.. ఇలా సరదాగా సాగిపోయింది. కానీ ఉన్నట్టుండి ఆ అమ్మాయి 'వెల్డర్' లవర్ ని దూరం పెట్టింది. ప్రేమా గీమా జాన్తానై అని చెప్పింది. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తన చదువు, హోదాకి తగ్గట్టు ఇంట్లో మంచి సంబంధం చూస్తున్నారని, ఉద్యోగస్తుడినే పెళ్లాడతానంది. దీంతో బేబీ సినిమాలో లాగా హీరో తట్టుకోలేకపోయాడు. బ్రేకప్ తో కోపం తెచ్చుకుని బ్లాక్ మెయిల్ కి దిగాడు.

ప్రేమలో ఉన్నప్పుడు సన్నిహితంగా దిగిన ఫొటోలను చూపిస్తూ నాగరాజు బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో ఆ యువతి విషయాన్ని తల్లితో చెప్పింది. తల్లి సాయంతో నాగరాజు సంగతి తేల్చాలని వారు అతడు ఉంటున్న ఇంటికి వచ్చారు. రాత్రివేళ నాగరాజు ఇంటి తలుపు తట్టారు. ఎదురుగా ప్రేయసి, కాబోయే అత్త ఉండటంతో మర్యాదగా లోపలికి పిలిచాడు నాగరాజు. అక్కడ సెటిల్మెంట్ మొదలైంది. తన కూతురు జీవితం నాశనం చేయొద్దంటూ ముందు మంచిగానే నచ్చజెప్పిన యువతి తల్లి, తర్వాత కత్తి బయటకు తీసింది. నాగరాజుని ఒక్క పోటు పొడిచింది. నాగరాజు షాకయ్యాడు, గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు గుమికూడారు. అంతలో తల్లీ కూతుళ్లు పారిపోయారు. స్థానికులు నాగరాజును ఆస్పత్రికి తరలించారు. భగ్న ప్రేమికుడి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News