థ్యాంక్యూ సీఎం సార్.. మణిపూర్ లోనూ జగన్ హవా..

మణిపూర్‌ నుంచి రాష్ట్రానికి చెందిన 163 మంది విద్యార్థులను సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ ఖర్చుతో ఆహారం ఇస్తున్నామని, వారు ఇంటికి చేరేంత వరకు రవాణా ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తోందని అంటున్నారు.

Advertisement
Update:2023-05-09 08:18 IST

మామూలుగా అయితే వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ మీడియా కానీ మణిపూర్ నుంచి తీసుకొచ్చిన విద్యార్థుల విషయంలో ఈ స్థాయిలో ప్రచారం చేసుకునేవారు కాదు. కానీ టీడీపీ రెచ్చగొట్టింది, మణిపూర్ విద్యార్థుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ప్రభుత్వంపై నిందలు వేశారు. దీంతో వైసీపీ చేసే పనితోపాటు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది.

"మాకు రోజూ ఒకటే వాటర్ బాటిల్ ఇచ్చారు. మా కష్టాలు విన్న మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు, మా సమస్య పరిష్కరించారు." ఈ స్టేట్ మెంట్ వింటే మరీ ఇంత ప్రచారమా అనుకోవచ్చు కానీ.. టీడీపీ చేసిన దుష్ప్రచారానికి ఈమాత్రం కౌంటర్ ఇవ్వాలంటోంది వైసీపీ బ్యాచ్. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఏపీకంటే కాస్త ముందే అలర్ట్ అయినా ఈ స్థాయిలో ప్రచారం మాత్రం చేసుకోలేదు.

మణిపూర్‌ నుంచి రాష్ట్రానికి చెందిన 163 మంది విద్యార్థులను సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. ఇండిగో ఏ 320 ఫ్లైట్‌ లో సోమవారం మధ్యాహ్నం 12.45కు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టు చేరుకున్న విద్యార్థులను అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో సొంత ప్రాంతాలకు పంపించారు. మణిపూర్‌ నుంచి కోల్ కతా చేరుకున్న 55 మంది విద్యార్థులను అక్కడినుంచి మరో 3 విమానాల ద్వారా హైదరాబాద్ కి తీసుకొస్తున్నామని చెప్పారు. వీరందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఆహారం ఇస్తున్నామని, వారు ఇంటికి చేరేంత వరకు రవాణా ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తోందని అంటున్నారు.

థ్యాంక్యూ సీఎం సార్..

థ్యాంక్యూ జగన్ సార్ అనే నినాదాలు మణిపూర్ లో కూడా మొదలయ్యాయి. ఏపీలో వారు ల్యాండ్ అయ్యాక సీఎం జగన్ కి విద్యార్థులు ధన్యవాదాలు చెబుతున్నారంటూ వారి అనుకూల మీడియా కథనాలనిచ్చింది. విపత్తుల వేళ వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సకాలంలో స్పందించి, వారికి సాయం అందించి, సొంత ప్రాంతాలకు తరలించడం మంచి పనే. కానీ ఏపీలో మాత్రం ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రచార కార్యక్రమంలా మారింది. తమ వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, విద్యార్థులను ఏపీకి తెచ్చిందని ప్రతిపక్షం చెప్పుకున్నా, అంతిమంగా విద్యార్థులకు మేలు కలగడమే ఇక్కడ సంతోషించదగ్గ విషయం. 

Tags:    
Advertisement

Similar News