AP SSC Results 2023: ఫలితాలొచ్చిన గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య
AP SSC Results 2023: ఏపీలో టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి, బాలురకంటే బాలికలే ఉత్తీర్ణత శాతంలో ముందున్నారు. అయితే ఫలితాలు చూసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కూడా బాలికలే కావడం విచారకరం.
ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత 9మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గంటల వ్యధిలోనే ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. టెన్త్ క్లాస్ ఫెయిల్ కావడంతో అవమాన భారంతో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఫలితాల విడుదల సమయంలో విద్యార్థులు సంయమనంతో ఉండాలని సూచించారు మంత్రి బొత్స. ఫెయిలైనవారు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని చెప్పారు. తల్లిదండ్రులు వారిని మానసికంగా బలవంతులుగా మార్చాలన్నారు. ఆయన ధైర్య వచనాలు చెప్పినా కూడా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం బాధాకరం.
సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం నవాబుకోటలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఆమె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో టెన్త్ ఫెయిల్ అయిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్ష ఫలితాలు వచ్చిన గంటలోపే ఆమె మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్యాపిలి కస్తూర్బా విద్యాలయంలో ఆమె చదువుకుంది.
ఏపీలో టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి, బాలురకంటే బాలికలే ఉత్తీర్ణత శాతంలో ముందున్నారు. అయితే ఫలితాలు చూసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు కూడా బాలికలే కావడం విచారకరం. ఇక టెన్త్ క్లాస్ ఫెయిలైన విద్యార్థులకోసం జూన్ 2 నుండి 10వతేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మే 17 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేట్ ఫీజ్ తో మే 22 వరకు గడువు ఇచ్చారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఈ నెల 13వతేదీ తుది గడువుగా నిర్ణయించారు.