ప్రభాస్‌తో వైసీపీ నేతలు.. ఏపీలో పొలిటికల్ ట్విస్ట్..

మొగల్తూరు పరిసర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్‌ మెంట్‌ తరపున కేటాయిస్తున్నామని అన్నారు మంత్రి రోజా. స్మృతివనం ఏర్పాటుపై ప్రభాస్ తో చర్చించారు.

Advertisement
Update:2022-09-29 20:46 IST

కృష్ణంరాజు మరణించిన తర్వాత హైదరాబాద్ కి బీజేపీ నేతలు క్యూ కట్టారు. కేంద్ర మంత్రులు కూడా కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా కృష్ణంరాజు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ తరపున మంత్రి కేటీఆర్, ఇతర నేతలు ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఏపీ ప్రభుత్వం తరపున పరామర్శలకు నేతలెవరూ రాలేదని, కనీసం జగన్ అయినా ఆ కుటుంబాన్ని పలకరించాల్సిందనే మాటలు వినపడ్డాయి. కట్ చేస్తే, ఈరోజు మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు ఏపీ మంత్రులు క్యూ కట్టారు.

మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సంస్మరణ సభకు హాజరయ్యారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా సానుభూతి తెలిపారు. అంతే కాదు, కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయబోతోంది. కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మొగల్తూరు పరిసర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్‌ మెంట్‌ తరపున కేటాయిస్తున్నామని అన్నారు మంత్రి రోజా. స్మృతివనం ఏర్పాటుపై ప్రభాస్ తో కూడా వారు చర్చించారు.

కృష్ణంరాజు మృతి తర్వాత జగన్ పరామర్శకు వెళ్లలేదని టీడీపీ నేతలు కార్నర్ చేయాలని చూశారు. అయితే ఇప్పుడు వైసీపీ మంత్రులు సంస్మరణ సభకు వెళ్లడం, స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటన చేయడంతో టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చినట్టయింది. ఈ సంస్మరణ సభను బీజేపీ నేతలు పట్టించుకోకపోవడం విశేషం. కృష్ణంరాజు చివరి రోజుల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆయన తమ పార్టీ తరపున కేంద్ర మంత్రిగా పనిచేశారని బీజేపీ నేతలు ఓన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు కృష్ణంరాజు స్మృతివనం పేరుతో రెబల్ స్టార్ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News